నెమ్మదించింది అనుకున్న కరోనా వైరస్ మహారాష్ట్రలో మరోసారి విజృంభిస్తోంది. గత కొన్ని వారాలుగా రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతోంది. ముంబయి, పుణె నగరాల్లో తీవ్రత ఎక్కువైంది. దీంతో పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న పుణెలో గడిచిన రెండు, మూడు రోజులుగా నిత్యం 500 పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజు ఏకంగా 849 కేసులు బయటపడ్డాయి.

దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది సోమవారం రాత్రి నుంచే అమలులోకి వస్తుందని పుణె డివిజినల్‌ కమిషనర్ వెల్లడించారు.

అంతేకాకుండా ఫిబ్రవరి 28 వరకు పాఠశాలలు, కాలేజీలు కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో కేవలం అత్యవసర సేవల్లో పాల్గొనే వారికి మాత్రమే అనుమతి ఉంటుందని డీసీ పేర్కొన్నారు.  

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 14 వేలు నమోదు కాగా, 90 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో ప్రస్తుతమున్న యాక్టీవ్ కేసుల్లో 74 శాతం మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో 49వేల యాక్టివ్‌ కేసులు ఉండగా, కేరళలో అత్యధికంగా 58వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

అయితే మహారాష్ట్ర, కేరళలోనే కాకుండా దేశంలోని మరో ఐదు రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఛత్తీస్‌‌గఢ్, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లోనూ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.