బోల్తా పడిన బస్సు.. నలుగురు మృతి, 28 మందికి గాయాలు
Pulwama: జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బీహార్ కు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.

Road accident: జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో బీహార్ కు చెందిన నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 28 మంది గాయపడ్డారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని బర్సూ ప్రాంతంలోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందడంతో బీహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటాని తెలిపింది. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.
జమ్మూకాశ్మీర్ లోని అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరపాలనీ, మృతుల స్వగ్రామాలకు మృతదేహాలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని, ప్రమాదంలో గాయపడిన బీహార్ కు చెందిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని న్యూఢిల్లీలోని రాష్ట్ర రెసిడెంట్ కమిషనర్ ను ఆదేశించినట్లు బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సంతాపం..
బస్సు ప్రమాదంలో మృతులకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంపై ఎల్జీ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవంతిపొరాలో జరిగిన బస్సు ప్రమాదంలో విలువైన ప్రాణాలు పోయాయనీ, పలువురు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాననీ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు.