జమ్మూలో ఎన్‌కౌంటర్: పుల్వామా దాడి ఘటనలో కీలకపాత్రధారి లంబూ సహా అనుచరుడి మృతి
జమ్మూలో శనివారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్ లో పుల్వామా దాడి ఘటనలో కీలక నిందితుడు లంబూ అతని సహయకుడు మరణించాడని భద్రతా దళాలు ప్రకటించాయి. లంబూపై 14 కేసులున్నాయి.
న్యూఢిల్లీ:జమ్మూ కాశ్మీర్ లో శనివారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కీలక ఉగ్రవాదులు మరణించారు.2019లో పుల్వామా వద్ద సీఆర్‌ఫీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడికి కీలక సూత్రధారిగా ఉన్న లంబూ అలియాస్ మహ్మద్ ఇస్మాయిల్ అల్వీ సహా అదాన్ అనే జైషే మహ్మద్ తీవ్రవాదులు మరణించారు.
2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేతోపోరా ఏరియా వద్ద సీఆర్‌పీఎఫ్ వాహనంపై ఆత్మహుతి దాడిలో 40 మంది సీఆర్‌ఫీఎప్ జవాన్లు మరణించారు.ఆర్మీ, పోలీసు అధికారులు శనివారం నాడు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లంబూపై ఇప్పటివరకు 14కేసులు నమోదైనట్టుగా భద్రతాధికారులు చెప్పారు.
2019 లో జరిగిన పుల్వామా దాడిలో మొత్తం 19 మంది ఉన్నారని పోలీసులు చెప్పారు. పలు ఎన్ కౌంటర్ లలో లంబూ సహా ఎనిమిది మందిని భద్రతాదళాలు కాల్చిచంపాయి. మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇంకా ఐదుగురి కోసం గాలింపు చేపట్టామని ఐజీ తెలిపారు.ఎస్‌పీఓ ఫయాజ్ అహ్మద్ ఆయన భార్యను కూడ కాల్చి చంపిన ఘటనలో లంబూ నిందితుడని పోలీసులు చెప్పారు.లంబూ ఎల్ఈడీలు తయారీ చేయడంలో దిట్టగా పోలీసులు చెప్పారు. దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో లంబూ చాలా కాలంగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. భద్రతాదళాలపై పలు దాడుల్లో లంబూ కీలక నిందితుడని పోలీసులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కచ్చితమైన సమాచారం మేరకు భద్రతాదళాలు నమిబియాన్, మరాస్ అడవులతో పాటు డచిగాం ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఆర్మీ లెప్టినెంట్ పాండే చెప్పారు. భద్రతా దళాలు కూడ ఉగ్రవాదులకు ధీటుగా జవాబు చెప్పినట్టుగా ఆయన తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో లంబూ అతని సహాయకుడు చనిపోయారని పాండే వివరించారు.
గతంలో పోలీసుల నుండి లంబూ తప్పించుకొన్నాడు. సామాన్యుల రక్షణగా ఉపయోగించుకొని తప్పించుకొన్నాడు. శనివారం నాడు కూడ ఇద్దరు మహిళలను అడ్డు పెట్టుకొని లంబూ తప్పించుకొనే ప్రయత్నం చేశాడని ఆర్మీ అధికారులు చెప్పారు. మూడు నిమిషాల వ్యవధిలోనే లంబూను హతమార్చినట్టుగా ఆయన తెలిపారు. ఈ ఘటనలో సామాన్యులకు ఎలాంటి గాయం కాకుండానే లంబూ అతడి అనుచరుడిని ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టామని భద్రతాధికారులు తెలిపారు.మృతుల నుండి ఎం-4 కార్బైన్, ఓ ఫిస్టల్, ఏకే 47 రైఫిల్ ను స్వాధీనం చేసుకొన్నారు.