పుదుచ్చేరి ఏకైక మహిళా ఎమ్మెల్యే, మంత్రి రాజీనామా.. కులతత్వం, లింగవివక్షే కారణం..
పుదుచ్చేరి ఏకైక ఎమ్మెల్యే, మంత్రి ఎస్ చండీరా ప్రియంగా తన పదవికి రాజీనామా చేశారు. కులతత్వం, లింగ వివక్ష ను తాను సహించలేకపోతున్నానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. అందుకే తన పదవి నుంచి వైదొలుగుతున్నానని చెప్పారు.

పుదుచ్చేరిలో ఏకైక మహిళా ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు నెలకొల్పి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ చండీరా ప్రియంగా తన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కులతత్వం, లింగ వివక్షను ఎదుర్కోవడంతో పాటు కుట్ర, ధనబలంతో కూడిన రాజకీయాలను తాను ఎదుర్కొంటున్నాని ఈ సందర్భంగా ఆమె ఆరోపిస్తూ ఏఐఎన్ఆర్సీ-బీజేపీ సంకీర్ణ మంత్రివర్గానికి రాజీనామా చేశారు.
2021లో నేదుంగాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. 40 ఏళ్ల తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో మంత్రి అయిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఎన్.రణగస్వామి నేతృత్వంలోని సంకీర్ణ మంత్రివర్గంలో ఆమెకు రవాణా శాఖను అప్పగించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎన్ఆర్సీ టిక్కెట్ పై కరైకాల్లోని నెడుంగాడు రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి చండీరా ప్రియాంగ ఎన్నికయ్యారు.
‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం ప్రకారం.. మంగళవారం మంత్రి పదవికి రాజీనామా చేసిన చండీరా ప్రియంగా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయంలో తన కార్యదర్శి ద్వారా సమర్పించారు. ఈ లేఖ అందినట్లు సీఎంవో వర్గాలు ధృవీకరించాయి. అయితే దీనిపై ఇంకా సీఎం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
కాగా.. ఎస్ చండీరా ప్రియంగా తన రాజీనామా లేఖ కాపీని మీడియాకు అందజేశారు. తన నియోజకవర్గంలోని ప్రజల్లో తనకున్న ప్రజాదరణ కారణంగానే తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టానని ఎస్ చండీరా ప్రియంగా అన్నారు. అయితే ఈ కుట్ర రాజకీయాలను అధిగమించడం అంత సులభం కాదని తెలిపారు. ధనబలం అనే పెద్ద భూతానికి వ్యతిరేకంగా తాను పోరాడలేనని గ్రహించానని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
తాను కులతత్వానికి, లింగ వివక్షకు గురయ్యానని ఆమె లేఖలో ప్రస్తావించారు. ‘‘నన్ను కూడా నిరంతరం టార్గెట్ చేస్తున్నారు. కుట్ర రాజకీయాలను, డబ్బు అనే భూతాన్ని ఇక నేను భరించలేనని తెలుసుకున్నాను. ’’ అని పేర్కొన్నారు. తాను మంత్రిగా చూస్తున్న శాఖల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు, సంస్కరణలు చేశానో త్వరలోనే సమగ్ర నివేదికతో వెల్లడిస్తానని చండీరా ప్రియాంగ తెలిపారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలకు క్షమపణలు చెప్పారు. కాగా.. ఆమె గృహనిర్మాణం, కార్మిక, ఉపాధి శాఖలను ఆమె నిర్వహించారు.