బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా.. పుదుచ్చేరి (Puducherry) తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. శనివారం రాత్రి అలల అల్లకల్లోలానికి రాక్ బీచ్‌లోని ఐకానిక్ పీర్ (Iconic Pier) వంతెన పాక్షికంగా కూలిపోయింది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా.. పుదుచ్చేరి (Puducherry) తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. శనివారం రాత్రి అలల అల్లకల్లోలానికి రాక్ బీచ్‌లోని ఐకానిక్ పీర్ (Iconic Pier) వంతెన పాక్షికంగా కూలిపోయింది. ఈ మేరకు ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. ఇక, 60 ఏళ్లు పైబడిన ఈ వంతెన ఎంతో ఫేమస్. పలు చిత్రాల షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ Life of Pie చిత్రంలో కూడా ఈ బ్రిడ్జి కనిపించింది.
ఇదిలా ఉండగా.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గత ఆరు గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో నైరుతి దిశగా కదులుతుంది. అది ప్రస్తుతం శ్రీలంకలోని Trincomaleeకి ఈశాన్యంగా 310 కి.మీ దూరంలో, తమిళనాడులోని Nagappattinamకి తూర్పు-ఈశాన్యంగా 260 కి.మీ. పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 270 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం తెలిపింది.
అయితే రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. నైరుతిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కొమోరిన్ ప్రాంతం, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి సముద్ర పరిస్థితులు కల్లోలంగా ఉంటాయని ఐఎండీ నివేదిక పేర్కొంది. మత్స్యకారులు ఈ ప్రాంతాల్లోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఇక, ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైకాల్‌లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మార్చి 6వ తేదీన దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పాక్షికంగా కూలిపోయిన ఐకానిక్ పీర్‌ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించినట్టుగా తమిళిసై ట్విట్టర్‌లో తెలిపారు. బ్రిడ్జిని పరిశీలించి వెంటనే మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని పోర్టు అధికారులను కోరినట్టుగా చెప్పారు.