చెక్ పోస్టుల వద్ద గత కొద్దిరోజులుగా పడిగాపులు కాస్తున్న యానాం వాసులను 24గంటల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని.. అలా చేయకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు.  ఈమేరకు ముఖ్యమంత్రికి రాజీనామా పత్రాన్ని అందజేసినట్టు ఆయన తెలిపారు. 

యానాం నియోజకవర్గం అభివృద్ధికి గవర్నర్‌ అనునిత్యం అడ్డుపడుతున్నారని ఆరోపించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వందలాది కిలోమీటర్లు నడిచి వచ్చిన యానాం వాసులను చెక్‌పోస్టు వద్దే ఉంచడం ఎంత వరకు సమంజసని ఆయన ప్రశ్నించారు. గవర్నర్‌ వ్యవహరిస్తున్న తీరు వల్లే వారు మూడు రోజులుగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు.

యానాంలోకి అనుమతి ఇవ్వకపోవడంతో చెక్‌పోస్టు వద్ద 13మంది పడిగాపులు కాస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు లేకపోవడంతో ఒరిసా, బెంగళూర్‌, హైదరాబాద్‌, పుట్టపర్తి నుంచి కొంత దూరం వాహహనాల్లో, మరికొంతదూరం కాలినడనక నడిచి 13మంది యానాం చేరుకున్నారు. మూడు రోజులుగా చెక్‌పోస్టు సమీపంలోని షాపుల షెల్టర్ల వద్ద ఉంటున్నారు. యానాం వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో టిఫిన్‌, భోజనం పెడుతున్నారు. 

వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా వీక్షించిన మంత్రి మల్లాడి.. వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని కోరారు. లేకపోతే తాను మంత్రి పదవికైనా రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు.