దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బాధితులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి అసెంబ్లీలో కోవిడ్ కలకలం రేపింది.

ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్ఎస్‌జే జయబాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. జయబాల్‌ వ్యవహారంతో అసెంబ్లీలోని మిగిలిన శాసనసభ్యులు ఉలిక్కిపడ్డారు.

ముందుజాగ్రత్త చర్యగా అసెంబ్లీ సమావేశాలను ఆరుబయటకు మార్చారు. కాగా పుదుచ్చేరి శాసనసభలో ఈ నెల 20న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ రోజుతో పాటు. ఆ తర్వాతి రోజు సమావేశాల్లోనూ జయబాల్ పాల్గొన్నారు.

అలాగే వాకౌట్ కార్యక్రమంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. మరోవైపు జయబాల్‌కు కోవిడ్ తేలడంతో అసెంబ్లీలో శానిటైజేషన్ చేపట్టారు. ఆయనతో కాంటాక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు.

కాగా, ఆరుబయట అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆదివారం లోగా బడ్జెట్‌ను ఆమోదించి.. సోమవారం నుంచి మిగిలిన సభ్యులు కూడా వైద్య పరిశీలనకు వెళ్లనున్నారు.