న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. దేశంలోని కోట్లాది ప్రజలు తమంత తాముగా జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకుని జనతా కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నారు.

తెలంగాణలో మాత్రం ఉదయం 6 గంటల నుంచే జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. రేపు ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలన్నీ బందయ్యాయి. నిత్యావసరాల కోసం అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. 

రవాణా వ్యవస్థ దాదాపు పూర్తిగా స్తంభించింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దుకాణాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు మూసేశారు.  కరోనాపై పోరాటానికి జనతా కర్ఫ్యూను పాటించాలని, కర్ఫ్యూను విజయవంతం చేద్దామని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్ ద్వారా ఆదివారం ఉదయం విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఇప్పుడు మనం తీసుకునే చర్యలు భవిష్యత్తుకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. వైద్యం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖ, ఆస్పత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలు బంకులు,, మీడియా వంటివాటికి మినహాయింపుకొనసాగుతోంది. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులను మాసేశారు. హైదరాబాదు, విజయవాడ మధ్య రహదారిని మూసేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాదు రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. విజయవాడలోని బెంజీ సర్కిల్ నిర్మానుష్యంగా కనిపిస్తోంది. అక్కడి ఫ్లై ఓవర్ ను మూసేశారు.