పబ్జీ ఆటకు బానిసైన వారు చేస్తున్న దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆటపై పిచ్చితో కుటుంబసభ్యులను, సన్నిహితులను కొందరు హతమారుస్తున్నారు. తాజాగా కర్ణాటకలో పబ్జీ ఆడొద్దన్నందుకు కన్నతండ్రిని నరికి చంపాడో కొడుకు.

వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా కాకతి గ్రామానికి చెందిన రఘవీర్ డిప్లొమో చదువుతున్నాడు. సెల్‌ఫోన్‌లో పబ్‌జీ ఆడుతూ దానికి అతను బానిసైపోయాడు. ఇటీవల ఓ రోజు రాత్రి పక్కింటి తలుపులు కొట్టి తనకు రక్తం కావాలంటూ కేకలు వేశాడు. అప్పటికే అతని మానసిక పరిస్ధితి తెలిసిన వారు తలుపులు తీయలేదు.

కోపంతో పిచ్చివాడిగా ప్రవర్తించిన అతను తలుపులు బద్ధలు కొట్టేందుకు యత్నించాడు. అక్కడితో ఆగకుండా కిటికీని బద్ధలు కొట్టేందుకు ప్రయత్నించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు తండ్రి శంకరప్పతో కలిపి ఆదివారం ఉదయం స్టేషన్‌కు చేరుకున్న రఘవీర్ అక్కడా కూడా వీరంగం వేశాడు.

పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో పాటు పరుగులు తీశాడు. పోలీసులు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి  పంపించారు. ఇంటికి రావడంతోనే మొబైల్‌లో పబ్‌జీ గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. ఫోన్‌లో డేటా ప్యాక్ గడువు ముగిసిందని..  రీఛార్జ్ చేయించాలంటూ తండ్రి శంకరప్పపై ఒత్తిడి తెచ్చాడు.

దీంతో ఆగ్రహం వ్యక్తి చేసిన ఆయన.. ఎప్పుడూ ఆటలేనా అంటూ ఫోన్ లాక్కున్నారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రఘువీర్ తండ్రిపై ద్వేషం పెంచుకుని ఉన్మాదిలా మారిపోయాడు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచాడు.

తల్లిని ఓ గదిలో బంధించి...  తండ్రిపై తొలుత కత్తెరతో దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా దగ్గరలో ఉన్న కత్తి పీటతో తల నరికి.. కాళ్లు, చేతుల్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. తల్లి బిగ్గరగా అరుపులు, కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రఘువీర్‌ని అతికష్టంపై అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.