కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా రోజుకి కొన్ని లక్షల మంది వైరస్ బారిన పడుతుంటే.. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఇప్పటివరకు ఈ వైరస్ కి పక్కాగా ఇది మందు అని ఎవరూ కనిపెట్టలేకపోయారు. దీంతో.. దానిని తగ్గించే క్రమంలో రకరకాల మందులు వాడుతూ వస్తున్నారు.

ఈ క్రమంలో.. కొందరికి హైడ్రాక్సీ క్లోరో క్వినోన్ మందుని వాడారు. సాధారణంగా దీనిని మలేరియా రోగుల కోసం వాడేవారు. ఇది కరోనా రోగుల్లోనూ కొందరిలో పనిచేయడంతో.. దీనికి కొద్ది మొత్తంలో ఇచ్చారు. అయితే.. ఇటీవల సోరియాస్ రోగులకు వాడే ‘ఇటోలీజుమ్యాబ్’ ఇంజక్షన్ ని కూడా కరోనా రోగులపై ప్రయోగించారు.

తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్‌కు గురైన వారిపై ‘ఇటోలీజుమ్యాబ్‌’ అనే ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తోందని ముంబైలోని నాయిర్‌ హాస్పిటల్‌ ప్రకటించింది. ఇద్దరు రోగులకు దీన్నిఅందించగా వెంటిలేటర్‌ దశ నుంచి సాధారణ స్థితికి చేరుకున్నట్లు వెల్లడించింది. 

బయోకాన్‌ కంపెనీ ఉత్పత్తి చేసే ఈ మందు ఒక్క డోసు ధర రూ.60 వేలు. బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)లోని ఆస్పత్రుల్లో ప్రయోగ పూర్వకంగా వాడేందుకు ‘ఇటోలిజుమ్యాబ్‌’ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా ప్రకటించారు.

దీంతో.. ధర ఎక్కువైనా కరోనాకి మందు దొరికింది కదా.. అని చాలా మంది సంబరపడ్డారు. అయితే.. దీనిపై ఇప్పుడు నిపుణులు కొన్ని ఆంక్షలు విధించారు. ఈ మందుని అందరు కరోనా రోగులపై వాడకూడదని చెప్పారు. కేవలం.. అత్యధికంగా బాధపడుతున్న వారికి మాత్రమే.. అత్యవసరంగా మాత్రమే వినియోగించాలని సూచించారు.