భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ46 ద్వారా రీశాట్-2బీర్1ను బుధవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కక్షలోకి ప్రవేశపెట్టనుంది.

ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమయింది. ఇది నిర్విరామంగా 25 గంటల పాటు కొనసాగనుంది. ముందుగా ఈ రాకెట్ ప్రయోగాన్ని బుధవారం ఉదయం 5.27 గంటలకు చేపట్టాలని నిర్ణయించారు.

అయితే ఆ సమయంలో అంతరిక్షంలో వ్యర్ధాలు అడ్డు రానుండటాన్ని ఇస్రో ముందుగా గుర్తించింది. దీంతో మూడు నిమిషాలు ఆలస్యంగా 5.30 గంటలకు చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు షార్‌లో జరుగుతున్నాయి.