Chandigarh: పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వివిధ శాఖల వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పంచకుల నుంచి చండీగఢ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులు వారిని సరిహద్దు వద్ద అడ్డుకున్నారు. వారిపైకి జల ఫిరంగులను, టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు.
Haryana Old Pension Scheme Protest: పాత పింఛను పథకం నేపథ్యంలో హర్యానాలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని వారిపైకి వాటర్ ఫిరంగులతో పాటు టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పంచకులలో ఈ నిరసనలు చేపట్టారు.
వివరాల్లోకెళ్తే.. హర్యానా బడ్జెట్ సమావేశాలకు ముందు పాత పెన్షన్ పథకం అంశం రాష్ట్రాన్ని వేడెక్కించింది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని వివిధ శాఖల ఉద్యోగులు పంచకుల నుంచి చండీగఢ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు వారిని సరిహద్దు వద్ద అడ్డుకున్నారు. వారిపైకి జల ఫిరంగులను, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
నిరసనల క్రమంలో హర్యానా ప్రభుత్వ ఉద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ నిరసనకారులను పంచకుల, చండీగఢ్ పోలీసులు సరిహద్దుల్లో అడ్డుకున్నారు. పింఛన్ల పునరుద్ధరణ పోరాట కమిటీ (Pension Bahali Sangharsh Samiti) నేత ప్రవీణ్ దేశ్వాల్ మాట్లాడుతూ.. దాదాపు 70 వేల మంది ఉద్యోగులు నిరసన తెలిపారు. రాజస్థాన్ లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులతో మాట్లాడటం లేదన్నారు. శాంతియుతంగా నిరసన కొనసాగిస్తామన్నారు.
2006 తర్వాత హర్యానాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 1.74 లక్షల మంది ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ కోసం సరిహద్దులు దాటి పోరాడుతామని ఆందోళన చేస్తున్న ఉద్యోగులు చెబుతున్నారు. అదే సమయంలో దీనిపై రాజకీయం కూడా నడుస్తోంది. 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఇప్పటికే చెప్పారు.
ఈ మూడు రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ
రాజస్థాన్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ పథకాన్ని అమలు చేసింది. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఓపీఎస్ ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
