రైతులు పిలుపునిచ్చిన ట్రాక్టర్ ర్యాలీతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. ఢిల్లీలోకి ప్రవేశించిన రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్నారు. భారీ కేడ్లను దాటుకుని వస్తున్నారు. రైతులను నిలువరించేందుకు లాఠీఛార్జీ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు.

అయినా రైతులు వెనక్కి తగ్గడం లేదు. రూట్ మ్యాప్‌ను సైతం మార్చేస్తున్నారు. సరిహద్దుల్లోని రోడ్లన్నీ రైతులతో కిక్కిరిసిపోతున్నారు. పిల్లలు, మహిళలు కూడా ర్యాలీలో పాల్గొంటున్నారు.

ఇండియాగేట్, రాజ్‌పథ్, రాజ్‌ఘాట్ వైపు వెళ్లకుండా రైతుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే ఆదాయపు పన్ను కార్యాలయం వద్ద బారికేడ్లను తోసేశారు. ఇదే సమయంలో ట్రాక్టర్లతో ఎర్రకోట దగ్గరకు వెళ్లిన రైతులు.. కోట బురుజులపై జాతీయ జెండా స్థానంలో తమ జెండాలను ఎగురవేశారు.

ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లను పోలీసులు మూసివేశారు. త్రివిధ దళాల కవాతుకు పోటీగా రైతుల ర్యాలీ సాగింది. దీంతో శకటాల ప్రదర్శన ఆగిపోయింది. పలుచోట్ల ట్రాక్టర్లు వెళ్లకుండా బస్సులను పోలీసులు అడ్డుగా ఉంచారు.

దీంతో దిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ బస్సును ధ్వంసం చేసిన ఆందోళన కారులు, మరిన్ని బస్సులను ట్రాక్టర్లతోనే పక్కకు తోసేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు చేపట్టిన ర్యాలీకి సాయంత్రం 5గంటల వరకు అనుమతి ఉండడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అనుమతించిన రూట్లలో కాకుండా రైతులు మరోవైపు వెళ్తుండడంతో వారిని నియంత్రించేందుకు శారదా నగర్‌లోని చింతామని చౌక్‌ వద్ద స్వల్ప లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఇక సెంట్రల్‌ దిల్లోని ఐటీఓ ప్రాంతంలోనూ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ట్రాక్టర్‌ పరేడ్‌లు పలు చోట్ల ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు ఆందోళన చేస్తోన్న రైతులకు విజ్ఞప్తి చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం, శాంతియుతంగానే ర్యాలీని నిర్వహించుకోవాలని సూచించారు. మరోవైపు రైతులపై పోలీసులు చేస్తోన్న దాడిని రైతు సంఘాల నేతలు ఖండిస్తున్నారు.