లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) హింస కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra)కు గత నెలలో బెయిల్ మంజూరు అయ్యింది. అయితే ఈ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra) కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరయ్యాక ఈ కేసులో సాక్షిపై దాడి జరిగిందని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ (N V Ramana) నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్ (Surya Kant), హిమా కోహ్లీ (Hima Kohli)లతో కూడిన ధర్మాసనం విచారించింది. సీజేఐ మాట్లాడుతూ.. “ ఒక సాక్షిపై దాడి జరిగినట్లు నిర్దిష్ట ఘటన కనిపిస్తోంది. దీనిపై వివరణాత్మక కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయండి. అతను రక్షించబడ్డారని మీరు నిర్ధారించుకోవాలి’’ అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్నిఆదేశించారు. సాక్షులకు రక్షణ కల్పించాలని సూచించారు.
బంధువుల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మాట్లాడుతూ.. ట్రయల్ కోర్టు అతనికి బెయిల్ గతంలోనే తిరస్కరించిందని తెలిపారు. అయితే హైకోర్టు బెయిల్ ఆర్డర్‌పై రాష్ట్రం ఎలాంటి అప్పీల్ దాఖలు చేయలేదని ఆయన సూచించారు. కాగా ఈ పిటిషన్ పై ప్రస్తుతానికి నోటీసులు జారీ చేస్తామని, హోలీ సెలవుల తర్వాత విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గతేడాది అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో రైతులు నిరసన తెలిపారు. అయితే నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రికి చెందిన వాహనాల కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన హింసాకాండలో ఇద్దరు బీజేపీ నాయకులు, ఓ డ్రైవర్ చనిపోయారు. ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ ను సవాలు చేస్తూ గత నెల 21వ తేదీన బాధితుల బంధువులు పిటిషన్ దాఖలు చేశారు. ముద్దాయి చేసిన దారుణమైన నేరాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు వాదించారు. చార్జిషీటులోని నిందితుడిపై ఉన్న బలమైన ఆధారాలు, ఆయన హోదా, పొజిషన్ వంటివి తమకు ఆందోళనకరంగా ఉన్నాయని పిటిషన్‌లో రైతుల కుటుంబాలు పేర్కొన్నాయి. ఆయన న్యాయ వ్యవస్థ నుంచి పారిపోయే ప్రమాదం ఉన్నదని, న్యాయాన్ని అడ్డుకోవడం, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆరోపించారు.
అదే సమయంలో బాధితులు కేసుకు సంబంధించిన కీలకమైన విషయాలను హైకోర్టు దృష్టికి తేలేకపోయామని, తమ కౌన్సెల్‌ను ఈ కేసులో విచారణకు హాజరుకాకుండా జనవరి 18వ తేదీ నుంచే తప్పించారని రైతుల కుటుంబాలు తెలిపాయి. తమ వివరాలను నివేదిక రూపంలో చాలా అరుదుగా మాత్రమే కోర్టుకు సమర్పించగలిగారని, కోర్టు సిబ్బందికి తాము చాలా సార్లు చేసిన ఫోన్‌లకు స్పందన లేకుండా పోయిందని వివరించాయి. ఈ కేసును ప్రభావవంతంగా మళ్లీ విచారించాలని తాము చేసిన దరఖాస్తును హైకోర్టు కొట్టేసిందనీ పేర్కొన్నారు.
