Prophet Row: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రార్థనల అనంతరం ఇక్కడి జామా మసీదు వెలుపల నిరసన చెలరేగాయి. వేలాది మంది ముస్లింలు  ప్లకార్డులు పట్టుకుని బీజేపీ నేత‌ల‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Prophet Row: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయ‌కురాలు నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద ప్రకటనపై రోజుకో చోట నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు ముస్లిం దేశాల‌ను నుంచి పెద్ద ఎత్తున నిరస‌న‌లు వెల్లువ‌డుతున్నాయి. ప‌లు దేశాలు భార‌తీయ వ‌స్తువుల‌ను బ‌హిష్క‌రి స్తున్నాయి. ఈ త‌రుణంలో దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ప‌లు ప్రాంతాల్లో నిర‌స‌నలు మిన్నంటాయి.

శుక్రవారం ప్రార్థనల అనంతరం ఢిల్లీలోని జామా మసీదు వెలుపల భారీ ఎత్తున నిర‌స‌న‌ వ్య‌క్త‌మ‌య్యింది. పెద్ద సంఖ్యలో ముస్లింలు గుమిగుడి.. పోస్టర్లు, బ్యానర్లు పట్టుకుని త‌మ వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేశారు. బిజెపి బ‌హిష్కృత నేత‌లు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ.. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వారిని అదుపు చేయ‌డానికి చుట్టూ బారికేడ్లు వేశారు. ప‌రిస్థితి చేదాటి పోతుంద‌ని ముందుగానే PAC , ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను సంఘటనా స్థలంలో మోహ‌రించారు. పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ప్రదర్శనకారులు కొంత సమయం తర్వాత సంఘ‌ట‌న స్థ‌లం నుండి వెళ్లిపోయారని, మరికొందరు మాత్రం నిరసన కొనసాగించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 

అలాగే.. ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, వివాదాస్పద పూజారి యతి నర్సింహానంద్‌తో సహా 31 మందిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయ‌డంపై కూడా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. విద్వేషాన్ని వ్యాపింప జేసి.. మతపరమైన మనోభావాలను దెబ్బతీసారనే ఆరోపణలపై బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై ప్రత్యేక కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే.. సోషల్ మీడియా విశ్లేషణ తర్వాత బుధవారం రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం మాజీ హెడ్ నవీన్ కుమార్ జిందాల్, జర్నలిస్టు సబా నఖ్వీలపై ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుండి సహరాన్‌పూర్ వరకు నిర‌స‌న‌లు వ్య‌క్తమ‌య్యాయి. ప్రయాగ్‌రాజ్‌లోని అటాలా ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనల తర్వాత వందలాది మంది ముస్లింలు గుమిగూడి నినాదాలు చేశారు. వీరంతా నూపుర్ శర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. 

ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ మాట్లాడుతూ.. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు మ‌సీదు క‌మిటీ పిలుపు ఇవ్వ‌లేద‌ని అన్నారు. మ‌సీదు ముందు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన‌వారు ఎవ‌రో త‌మ‌కు తెలియదని అన్నారు. శుక్ర‌వారం ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాల‌ని కొంద‌రు గురువారం ప్లాన్ చేశార‌ని, కానీ వాళ్లు మ‌సీదు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని షాహి ఇమామ్ తెలిపారు. బ‌హుశా వారు.. AIMIM లేదా ఒవైసీతో సంబంధం ఉన్న వ్యక్తులని అనిపిస్తోందని అన్నారు. నిరసనలు చేయాలనుకుంటే నిరసన తెలపవచ్చు. కానీ తాము మద్దతు ఇవ్వబోమని ఇప్పటికే స్పష్టం చేశామ‌ని అన్నారు.

పరిస్థితి అదుపులోనే ఉంది: ఢిల్లీ పోలీసులు 

ఈ నిర‌సన‌లపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. సస్పెండ్ చేయబడిన బీజేపీ నాయ‌కురాలు నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద ప్రకటనకు వ్యతిరేకంగా ప్రజలు జామా మసీదు వెలుపల నిరసన తెలిపారు. అక్కడి నుండి ప్రజలను తొలగించాము. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ముందు జాగ్ర‌త్త‌గా ప‌లు చోట్ల భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను మోహ‌రించామని తెలిపారు.

ప్రార్థనలకు ముందు డ్రోన్స్, ఫ్లాగ్ మార్చ్

శుక్రవారం ప్రార్థన స‌మ‌యంలో వివాదాస్ప‌ద ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌ని ముందుగానే గ్ర‌హించిన యూపీ పోలీసులు అప్రమత్తమ‌య్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని ప‌లు నగరాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆగ్రా నగరంలో ఫ్లాగ్ మార్చ్, కాన్పూర్‌లో 144 సెక్షన్ అమలు చేయగా, ఘజియాబాద్ డ్రోన్ ల‌తో నిఘా ఏర్పాటు చేశారు. కాన్పూర్‌లో గ‌త‌ శుక్రవారం ప్రార్థనల అనంతరం కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయడం గమనార్హం.

గ‌త శుక్రవారం ప్రార్థనల అనంతరం కాన్పూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. మహ్మద్ ప్రవక్తపై బిజెపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్యలకు నిరసనగా దుకాణాలను మూసివేసే ప్రయత్నంలో రెండు వర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఒక‌రిపై ఒక్క‌రూ ఇటుకలు,రాళ్ల‌తో దాడి చేసుకున్నారు. దీంతో ఈ ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు యూపీ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసింది.