ముహమ్మద్ ప్రవక్త ఓ 'మర్యాద పురుషోత్తం'.. మరో సారి బీహార్ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)
హిందూ పురాణాల్లో శ్రీరాముడిని సుత్తించడానికి ఉపయోగించే ‘మర్యాద పురుషోత్తం’ అనే సంస్కృత పదబంధాన్ని బీహార్ విద్యాశాఖ మంత్రి మహ్మద్ ప్రవక్త కోసం ఉపయోగించారు. ఇస్లాం మత వ్యవస్థాపకుడిని ఆయన మర్యాద పురుషోత్తంతో పోల్చారు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది.
రామ్ చరిత్ మానస్ విద్వేషాన్ని వ్యాప్తి చేసే పుస్తకం అంటూ వివాదాల్లో చిక్కుకున్న బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇస్లాం మంతం వ్యవస్థాపకుడైన ముహమ్మద్ ప్రవక్త ఒక 'మర్యాద పురుషోత్తం' అని అన్నారు. ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో సాతానిజం పెరిగి, విశ్వాసం అంతమై, నిజాయితీలేని మనుషులు, దయ్యాలు చుట్టుముట్టినప్పుడు.. మధ్య ఆసియా ప్రాంతంలో దేవుడు గొప్ప మనిషిని సృష్టించాడని, మర్యాద పురుషోత్తం, ముహమ్మద్ ప్రవక్తను విశ్వాసం తీసుకురావడానికి సృష్టించాడని మంత్రి చంద్రశేఖర్ అన్నారు.
సంస్కృత పదబంధం అయిన ‘మర్యాద పురుషోత్తం’ అంటే పరిపూర్ణ మానవుడు అని అర్థం. అయితే హిందూ పురాణాల్లో శ్రీరాముడిని 'మర్యాద పురుషోత్తం' అని సంబోధిస్తారు. కానీ ఆయన ముహమ్మద్ ప్రవక్త ను ఇలా పోల్చడం ఇప్పుడు వివాదంగా మారింది. దీనిపై బీజేపీ మండిపడింది. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ మతం, కులం పేరుతో ఉన్మాదాన్ని వ్యాప్తి చేస్తూ ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తోందని ఎదురుదాడికి దిగింది.
విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ అన్నారు. ‘‘అప్పుడప్పుడు రామాయణం గురించి, ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడుతుంటాడు. మతం, కులం పేరుతో పోరాడుతూ వీరు ఓటు రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని ఎంతమాత్రం ఖండించలేము’’ అని అన్నారు.
చంద్రశేఖర్ బిహార్‌లోని మాధేపురా స్థానం నుంచి వరుసగా మూడోసారి ఆర్జేడీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020లో జరిగిన ఎన్నికల్లో జన్ అధికార్ పార్టీకి చెందిన పప్పు యాదవ్ ను ఓడించారు. మాధేపురాలోని భలేవా గ్రామానికి చెందిన ఆయన తండ్రి ఓ టీచర్. ఆయన సోదరుడు రామచంద్ర యాదవ్ ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అయితే ఆయన తనను తాను ప్రొఫెసర్ గా చెప్పుకున్నప్పటికీ ఔరంగాబాద్ రామ్ లఖన్ సింగ్ యాదవ్ కళాశాలలో జంతుశాస్త్ర విభాగంలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. గతంలో పాట్నాలో జరిగిన ఒక స్నాతకోత్సవంలో రామచరితమానస్‌ను ద్వేషాన్ని వ్యాప్తి చేసే పుస్తకంగా అభివర్ణించి వార్తల్లో నిలిచారు.