Jamaat-e-Islami Hind: మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై నూపుర్ శర్మను అరెస్టు చేయాలని జమాతే ఇస్లామీ హింద్ డిమాండ్ చేసింది. అలాగే, క్షమాపణలు శిక్షను భర్తీ చేయగలిగితే, దేశంలో కోర్టులు,  జైళ్ల‌ అవసరం లేదని JIH అధ్యక్షుడు పేర్కొన్నారు.  

Nupur Sharma: ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండ్ అయిన భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ) నాయకురాలు నుపూర్ శర్మను వెంటనే అరెస్టు చేయాలని జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) శనివారం డిమాండ్ చేసింది. శిక్ష స్థానంలో క్షమాపణ చెప్పగలిగితే దేశంలో కోర్టులు, జైళ్లు అవసరం లేదని జేఐహెచ్ అధ్యక్షుడు సయ్యద్ సదాతుల్లా హుస్సేనీ అన్నారు. "దేశంలో ద్వేషాన్ని పెంచుతున్న రాజకీయ నాయకులు, టీవీ ఛానెళ్లు, మీడియా సంస్థలపై చర్య తీసుకోవాలని" JIH డిమాండ్ చేసింది.

శనివారం నాడు జేఐహెచ్ అధ్యక్షుడు సయ్యద్ సదాతుల్లా హుస్సేనీ, వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ సలీం ఇంజనీర్ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అయితే, సస్పెన్షన్‌కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి శర్మ దేశానికి క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు శుక్రవారం మౌఖిక పరిశీలనలో సూచించింది. కాగా, ఇటీవల మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో ఒక వృద్ధ హిందువుని తప్పుగా గుర్తించి కొట్టి చంపడం సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉదయ్‌పూర్ హత్య మరియు మాబ్ లిన్చింగ్ సంఘటనలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనీ, రాజకీయ నాయకులు, మీడియా ప్రేరేపిత చ‌ర్య‌లు కూడా ఉన్నాయ‌ని JIH నాయకులు చెప్పారు. ద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో వారిపాత్ర‌ను ప్ర‌స్తావించారు. 

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్ట్ చేయ‌డం.. ఇదే స‌మ‌యంలో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ మాజీ అధికార ప్ర‌తినిధి నుపూర్ శ‌ర్మ‌ను స్వేచ్ఛగా తిర‌గ‌డానికి.. తరలించడానికి అనుమతించడంపై హుస్సేనీ మాట్లాడుతూ, "ద్వేషాన్ని ప్రచారం చేసే వారిపై చర్య తీసుకోవడంలో ద్వంద్వ ప్రమాణం ఉండకూడదు. మతపరమైన గుర్తింపు ఆధారంగా నిందితులను విచారించడంలో రెండు రకాల చట్టాలు ఉండకూడదు" అని పేర్కొన్నారు. ఓ టీవీ ఛానెల్‌లో నుపూర్‌ వ్యాఖ్యలు చేసి నెల రోజులు గడుస్తున్నా అరెస్టు చేయకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని సలీం అన్నారు. దీంతో విదేశాల్లో భారత్ ప్రతిష్ట చెడిపోయిందని అన్నారు.

దురదృష్టవశాత్తు, మన దేశంలోని రాజకీయ వాతావరణం దూకుడుగా ద్వేషాన్ని ప్రోత్సహిస్తోందనీ, సానుభూతి, సహనాన్ని తగ్గిస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. మీడియాలోని ఒక విభాగం అటువంటి బాధ్యతారహిత రాజకీయ శక్తులతో చేతులు కలిపిందని ఇద్దరు JIH నాయకులు అన్నారు. దేశంలోని శాంతి, న్యాయాన్ని ప్రేమించే పౌరులందరూ చేతులు కలపాలని, ద్వేషం, హింసకు వ్యతిరేకంగా పోరాడాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్ర‌జ‌లు శాంతియుత మార్గాల‌తో ముందుకు న‌డ‌వాల‌ని పిలుపునిచ్చిరు. 

కాగా, మాజీ బీజేపీ అధికార ప్ర‌తినిధి నుపూర్ శ‌ర్మ ఓ టీవీ ఛానెళ్లో మాట్లాడుతూ మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, మ‌రో బీజేపీ నాయ‌కుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ట్వీట్ వివాదాల‌కు దారితీసింది. ఈ ఇద్ద‌రు నాయ‌కుల వ్యాఖ్య‌లు తీవ్ర రాజ‌కీయ దుమారం రేప‌డంతో పాటు దేశంలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు కార‌ణం అయ్యాయి. అర‌బ్ దేశాలు భార‌త్‌పై తీవ్రంగా స్పందించాయి. ఏకంగా భార‌త్ వ‌స్తువుల అమ్మ‌కాల‌పై నిషేధం విధించే వ‌ర‌కు ప‌రిస్థితులు వెళ్లాయి. ఇప్పటికీ గ‌ల్ప్ దేశాలు భార‌త్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌ల‌కు డిమాండ్ చేస్తున్నాయి.