న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రాపర్టీ కార్డ్స్ (ఆస్తి కార్డులు) ఇవ్వనున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రాపర్టీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నాడు ప్రారంభించారు. 

ఎస్వీఏఎంఐటీవీఏ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ప్రారంభించారు. గ్రామీణ ప్రజలు తమ ఆస్తిని ఆర్ధిక ఆస్తిగా మార్చుకొనేందుకు ఈ కార్యక్రమం దోహాదపడుతోందని ప్రధానమంత్రి కార్యాలయం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఈ కార్యక్రమంలో భాగంగా 1,32 వేల మంది భూములు కలిగిన వారికి కార్డులు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరితో ప్రధాని మోడీ ఇవాళ సంభాషించారు. 

ఇవాళ ఆస్తుల హక్కులకు సంబంధించిన పత్రాలు పొందిన వారిని ప్రధాని అభినందించారు. గ్రామాల్లో నివసిస్తున్న వారిని స్వావలంభన దిశగా  తీసుకెళ్లేందుకు ఈ పథకం దోహాదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 


దేశంలోని 763 గ్రామాల్లో ఈ కార్యక్రమం కింద లబ్దిదారులకు కార్డులు అందించనున్నారు. యూపీలో 346 గ్రామాలు , హర్యానాలో 221, మహారాష్ట్రలో 100, మధ్యప్రదేశ్ లో 44, ఉత్తరాఖండ్ లో 50, కర్ణాటక రాష్ట్రంలో రెండు గ్రామాల నుండి లబ్దిదారులున్నారు.

 

ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా దశలవారీగా అమలు చేయనున్నారు. 2000 నుండి 2024 వరకు 6,62 గ్రామాలను ఈ పథకం కింద కవర్ చేయనున్నారు.  ఈ గ్రామాల ప్రజలు తమ ఆస్తులను ఆర్ధిక ప్రయోజనాలను తీసుకోవడానికి ఆర్ధిక ఆస్తిగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతోంది.

జాతీయ పంచాయితీ దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద డ్రోన్ల ద్వారా ఆస్తిని సర్వే చేస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని యజమానుల యాజమాన్యం యొక్క రికార్డులను సృష్టిస్తోంది.  బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడానికి ఈ కార్డులు ఉపయోగపడుతాయి. చాలా మందికి తమ ఆస్తులకు సంబంధించి యాజమాన్య పత్రాలు రికార్డులు లేనందున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.