కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా చల్లారలేదు. దీనికి తోడు నిన్న రాత్రి భజరంగ్ దళ్ కార్యకర్త హత్యతో ఆందోళనలు మరోసారి ఎగిశాయి. ఈ నేపథ్యంలోనే స్కూల్స్, కాలేజీల చుట్టూ నిషేధాజ్ఞలు కొనసాగించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులోని స్కూల్స్, కాలేజీల గేటుకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రదర్శనలు చేయరాదని, ఈ ఆంక్షలు వచ్చే నెల 8వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో హిజాబ్ వివాదం(Hijab Row) రగిల్చిన నిప్పు ఇంకా చల్లారడం లేదు. భజరంగ్ దళ్ సభ్యుడు హర్ష మరణంతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులో విధించిన ఆంక్షల(Prohibitory Orders)ను ఎత్తేసేది లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, మరో రెండు వారాలపాటు ఆంక్షలను పొడిగించినట్టు ప్రకటించారు.
రాష్ట్రంలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతున్నదని, కాబట్టి, ఉద్రిక్త పరిస్థితులు ఇంకా ఉన్నాయని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ ఫిబ్రవరి 21వ తేదీన జారీ చేసిన అధికారపత్రంలో పేర్కొన్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నందున ఏ క్షణంలోనైనా మళ్లీ ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. కాబట్టి, ముందు జాగ్రత్తగా బెంగళూరులో స్కూల్స్, పీయూ కాలేజీలు, డిగ్రీ కాలేజీల చుట్టూ 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఈ ఆదేశాల ప్రకారం, స్కూల్, కాలేజీ గేటుకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రదర్శనలు, నిరసనలు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
బెంగళూరుతోపాటు దక్షిణ కన్నడ జిల్లాలోనూ ఆంక్షలు కొనసాగనున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో స్కూల్స్, కాలేజీ చుట్టూ నిషేధాజ్ఞలు ఫిబ్రవరి 26వ తేదీ వరకు పొడిగిస్తూ ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర వెల్లడించారు.
హిజాబ్ వివాదంపై కర్ణాటక మంత్రి ఆర్ అశోక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో చెలరేగుతోన్న ఈ వివాదం వెనుక ఐఎస్ఐఎస్‌తో పాటు పలు అంతర్జాతీయ సంస్థల కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదని అశోక్ అన్నారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నారని, ఉడుపిలో ప్రారంభమైన నిరసనలు అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్తాయని ఆయన ప్రశ్నించారు.
వేగంగా ఈ నిరసనలు వ్యాపించేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారంటూ అశోక్ నిలదీశారు. కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ సంస్థ కూడా ఈ వివాదం వెనుక ఉందని ఆయన ఆరోపించారు. చిన్నారులు ఇలాంటి మతపరమైన వివాదాల్లో భాగం కాకూడదని అశోక్ హితవు పలికారు. పిల్లలు ఇళ్లలో ఏమైనా చేసుకోవచ్చని, అయితే, విద్యా సంస్థల్లో మాత్రం విద్యపైనే దృష్టి పెట్టాలని సూచించారు. హిజాబ్‌పై చెలరేగుతోన్న వివాదంలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి తాము ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఈ అంశంపై తాము దశల వారీగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రితో ఈ అంశంపై తాను మాట్లాడతానని అశోక్ పేర్కొన్నారు.
మొన్నటి వరకు విద్యార్థులకే పరిమితమైన ఈ వివాదం ఉపాధ్యాయులకూ పాకింది. హిజాబ్ తొలగించాలని కాలేజీ యాజమాన్యం ఆదేశాలను నిరసిస్తూ ఓ టీచర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఘటన చర్చనీయాంశం అయింది. తాజాగా, ఈ వివాదం మరో మలుపు తీసుకుంది. ఓ విద్యార్థి నుదుటిపై తిలకం(Tilak) ధరించడం కూడా అభ్యంతరకర విషయంగా మారింది. కర్ణాటకలోని ఓ కాలేజీ యాజమాన్యం.. నుదుటిపై తిలకం బొట్టు పెట్టుకుని వచ్చిన విద్యార్థిని గేటు బయటే నిలిపేశారు. ఆ తిలకాన్ని తొలగిస్తేనే కాలేజీలోకి అనుమతిస్తామని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
