కర్ణాటకలో సంచలనం రేపిన సరళవాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ హత్య కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆయన దగ్గర ఇదివరకు పనిచేసిన వ్యక్తే అని తేలింది.
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రం హుబ్లీ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సరళ వాస్తు నిపుణులు చంద్రశేఖర్ గురూజీ హత్య తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వాస్తు సూచనల కోసం వచ్చాను అంటూ ఇద్దరు ఆగంతకులు ఆయన్ని దారుణంగా కత్తులతో పొడిచి పరారయ్యారు. చంద్రశేఖర్ శరీరంపై 39 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిని హోటల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. వారిని బెదిరిస్తూ అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హత్య జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నవారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
కర్ణాటకలోని హుబ్లీ నగర శివార్లలోని ఉణకల్ హోటల్లో చంద్రశేఖర్ బస చేశారు ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు ఆయన నుంచి వాస్తు సలహాలు తీసుకోవాలని చెబుతూ కలిసేందుకు వచ్చారు. ఆయనతో భేటీ అయిన కొద్ది క్షణాల్లోనే కత్తులతో దాడి చేశారు. ముప్పై తొమ్మిది సార్లు పొడిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని హుబ్లీ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన స్థలాన్ని పోలీస్ కమిషనర్ లాబూరామ్ సందర్శించారు. హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
హోటల్‌లో వాస్తు సిద్ధాంతి చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య.. సీసీటీవీలో దృశ్యాలు..
చంద్రశేఖర్ Guruji సరళ వాస్తు పేరుతో టీవీ షోను హోస్ట్ చేయడం ద్వారా కర్ణాటకలోనే కాదు.. జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. టీవీ ఛానల్ లలో ఆయన వాస్తుకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చేవారు. రెండు వేలకు పైగా సెమినార్లలో పాల్గొన్నారు. జాతీయ,, అంతర్జాతీయ స్థాయిలో 16కు పైగా అవార్డులు అందుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ తో పాటు కాస్మిక్ ఆర్కిటెక్చర్ లో చంద్రశేఖర్ గురూజీ డాక్టరేట్ పొందారు. దేశ విదేశాల్లోనూ ఆయన అభిమానులు ఉన్నారు. సరళ వాస్తు సలహాపై అనేక పుస్తకాలు కూడా రాశారు.
హోటల్ రిసెప్షన్ లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని ఆధారంగా పోలీసులు పరిశోధన చేపట్టారు.బెల్గాంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దాడికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బినామీ ఆస్తుల వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రెండు రోజుల క్రితం కూడా హంతకులు స్వామీజీ కలిసినట్లు తెలిసింది. పక్కాగా రెక్కీ నిర్వహించిన తర్వాత ఈ హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హుబ్లీలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన చాలా దారుణమని కర్ణాటక రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల్లో ఒకరు చంద్రశేఖర్ దగ్గర మాజీ ఉద్యోగి అని త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని హోంమంత్రి తెలిపారు.
