Yati Narsinghanand: విద్వేష పూరిత‌ ప్రసంగంతో వార్త‌ల్లో నిలిచే.. ఘజియాబాద్ దస్నా దేవాలయం ప్రధాన అర్చకుడు యతి నర్సింహానంద్​.. మరోమారు మ‌రో వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్తల్లో  నిలిచారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని హిందువులను కోరారు. 2029లో హిందువేతర వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడని, అలా జ‌రిగితే.. మ‌రో 20 ఏండ్ల‌లో భార‌త దేశం హిందువులు లేని దేశంగా మారుతుందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

Yati Narsinghanand: తన విద్వేష ప్రసంగాలతో వార్తల్లో నిలుస్తారు ఘజియాబాద్ దస్నా దేవాలయం ప్రధాన అర్చకుడు యతి నర్సింహానంద్​. ఇప్ప‌టికే విద్వేష ప్రసంగాలు చేసి.. ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఇటీవ‌లే బెయిల్​పై విడుదలయ్యారు. తాజాగా.. హిందూ ముస్లీంల మ‌ధ్య విద్వేషాలు రేకెత్తించే విధంగా.. గురువారం గోవర్ధన్‌లో విలేకరులతో మాట్లాడారు. రానున్న దశాబ్దాల్లో మన దేశం హిందూ రహితంగా మారకుండా జాగ్రత్తవహించాలని ఆయ‌న‌ హిందువులకు విజ్ఞప్తి చేశారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని హిందువులను కోరారు. హరిద్వార్‌లో విద్వేష ప్రసంగం కేసులో ఆయన బెయిలుపై విడుదలైన సంగతి తెలిసిందే.

2029లో హిందువేతర వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడని గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఒక్కసారి హిందువేతర వ్యక్తి ప్రధానమంత్రి అయితే,. మరో 20 ఏళ్లలో ఈ దేశం హిందువులు లేని దేశంగా మారుతుందని ఆయన అన్నారు. హిందుత్వాన్ని మేల్కొల్పేందుకు ఆగస్టు 12 నుంచి ఆగస్టు 14 వరకు మధుర-గోవర్ధన్ ప్రాంతంలో ధర్మసంసద్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

గత ఏడాది డిసెంబర్ 17 నుంచి 19 వరకు హరిద్వార్‌లో ధర్మ సంసద్‌ను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ నర్సింహానంద్‌పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు. 

ఆయ‌న గ‌త ఆదివారం.. ఢిల్లీలో జరిగిన హిందూ మహా పంచాయతీలో మాట్లాడుతూ.. "2029లోనో, 2034లోనో లేక 2039లో ముస్లిం అభ్య‌ర్థి ప్రధాని అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే.. 50శాతం హిందువులు.. ముస్లింలుగా మతాన్ని మార్చుకుంటారు. మిగిలిన 40శాతం మందిని ముస్లింలు చంపేస్తారు. మిగిలిన మరో 10శాతం మంది శరణార్థులుగా జీవిస్తారు. ఇదే హిందువుల భవిష్యత్తు. నేను చెప్పిందే జరుగుతుంది. అందువల్ల ఈ భవిష్యత్తును మార్చుకోవాలంటే.. మీరు మ‌నిషిలా మారి.. ఆయుధాలను చేపట్టండి," అని నర్సింహానంద్​ పేర్కొన్నారు. 

అలాగే.. “తమ డిమాండ్లను నెరవేర్చమని హిందువులు వేడుకోవడం నేను చాలా కాలంగా చూశాను. కానీ ఏ ఒక్క హిందువు డిమాండ్ కూడా నెరవేరడం నేను చూడలేదు. భిక్షాటన చేయడం ద్వారా కాదు, కోర్టు జోక్యంతో మాకు రామజన్మభూమి వచ్చింది, కాబట్టి బిచ్చగాడిగా ఉండటం మానేయండి” అని నర్సింహానంద్ పేర్కొన్నారు. ఈ ప్రసంగానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది, అయితే నిర్వాహకులు దానిని కొనసాగించారు.