పాట్నా: కాంగ్రెస్ పార్టీతో పొత్తే తమను అధికారానికి దూరం చేసిందని తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అధిక స్థానాల్లో పోటీకి మాత్రమే కాంగ్రెస్ ఆసక్తి చూపుతుందని... గెలుపు కోసం కాదని ఆర్జేడి నేతలు కొందరు ఇప్పటికే బహిరంగంగా విమర్శించారు. తాజాగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారి కూడా కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ కీలక నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

''బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి మరీ 70స్థానాల్లో పోటీలో నిలిచింది. అయితే ఇలా అధిక సీట్ల కోసం పోటీపడిన ఆ పార్టీ గెలుపుకోసం చిత్తశుద్దితో పనిచేయలేదు. 70 స్థానాల్లో పోటీచేసి కనీసం 79 ప్రచార సభలు కూడా నిర్వహించలేకపోయింది. ఆ పార్టీ కీలక నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా అయితే కీలకమైన ఈ ఎన్నికల సమయంలో పిక్నిక్ చేసుకున్నారు'' అంటూ శివానంద్ మండిపడ్డారు.

''కాంగ్రెస్ పార్టీ తరపున ముక్కూ మొహం తెలియన వారు ప్రచారంలో పాల్గొన్నారు. ఒక్క బిహార్ లోనే కాదు ఆ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ ఇలా వ్యవహరించే ఓటమిపాలవుతోంది. తమ ఎన్నికల స్ట్రాటజీ పట్ల కాంగ్రెస్ అధినాయకత్వం పునరాలోచించుకుంటే మంచిది'' అని ఆర్జేడి నేత సూచించారు. 

read more   బీహార్ ఎన్నికల ఫలితాలు: అసదుద్దీన్ ఓవైసీపై ఉర్దూ కవి సంచలన వ్యాఖ్యలు
 
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో 74 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) 43 స్థానాలకే పరిమితమైంది. బీహార్ లో జేడీ(యూ), బీజేపీ కంటే తక్కువ స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ)లు కలిసి పోటీ చేశాయి. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్ జే పీ కేవలం ఒక్క సీటును గెలుచుకొంది.

ఇక తేజస్వి యాదవ్ సారథ్యంలో ఆర్జెడి పార్టీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 75 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లలో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది.  సీపీఐఎంఎల్ 19 సీట్లలో పోటీ చేసి 12 స్థానాల్లో గెలిచింది.