బిహార్ లో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయ ఢంకా మోగించింది. కాగా.. ఈ ఎన్నికల నేపథ్యంలో.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ఉర్దూ కవి మునవర్ రానా సంచలన కామెంట్స్ చేశారు.

ఓవైసీ లాంటి నాయకులు ముస్లింలను విభజించి నాశనం చేశారంటూ మునావర్ రానా ఆరోపించారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాతో ఓవైసీ సమానమంటూ మునావర్ రానా సంచలన ఆరోపణలు చేశారు. కాగా.. భారత్ లో మరో జిన్నాను అభివృద్ధి చేయడానికి తాము అనుమతించమని ఆయన అన్నారు.

ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో.. మునావర్ రానా .. అసదుద్దీన్ పై మండిపడ్డారు. ఎంఐఎం పార్టీ ఎప్పుడూ ముస్లిం ఓట్లు చీలిపోయేలా చేస్తుంటాడని.. దాని వల్ల బీజేపీకి ప్రయోజనం చేకూరుతూ వస్తుందని మండిపడ్డారు.

ఓవైసీ పార్టీ.. బీజేపీ కి ఏజెంట్ లాగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ పార్టీ ఓట్లను చీలుస్తూ వస్తోందన్నారు. అసదుద్దీన్, అతని తమ్ముడు అక్బరుద్దీన్ లు ముస్లింలను ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టించారని ఆరోపించారు.

ఓవైసీ తన రూ.15వేల కోట్ల ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీకి ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చడానికి ఇలా ఓట్లను చీల్చారంటూ మండిపడ్డారు. కేవలం తన ఆస్తులు, భూములు, వ్యాపారాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

బిహార్ రాష్ట్రంలోని ముస్లిం ఆధిపత్య ప్రాంతమైన సీమాంచల్ నియోజకవర్గంలో.. బీజేపీని తరిమికొట్టడానికి తేజశ్వి యాదవ్ నేతృత్వంలోని మహాగత్ బంధన్ ప్రయత్నించిందన్నారు. కానీ.. అసదుద్దీన్ తన సొంత ప్రయోజనాల కోసం బీజేపీ సహాయం తీసుకున్నారని.. తన స్వార్థం కోసం బీహార్ రాజకీయాలను మార్చేశారంటూ మండిపడ్డారు.

బిహార్ లో కేవలం ఐదు సీట్లు గెలవడం వల్ల ఎంఐఎం పార్టీ ముస్లింలకు ఎలాంటి సహాయం చేస్తుందని ప్రశ్నించారు. అసదుద్దీన్ యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని చెప్పారు. బిహార్ ఎన్నికల్లో ఓట్లు చీల్చన అసదుద్దీన్ ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ లో ఓట్లు చీల్చాలని చూస్తున్నారని ఆరోపించారు.

తాను చనిపోయేలోగా.. ముస్లింలను, ముఖ్యంగా యువతను నాశనం చేయాలని చూస్తున్న నేరస్థులను గుర్తించడంలో తాను సహాయం చేస్తానని చెప్పారు. 

ఇదిలా ఉండగా.. ఉర్దూకవి మునవర్ రానా పై ఇటీవల ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.  ఫ్రాన్స్‌లో ఇటీవ‌ల జ‌రిగిన హ‌త్య‌ల‌ను ఆయ‌న స‌మ‌ర్థించారు. ఈ నేప‌థ్యంలో హ‌జ్ర‌త్‌గంజ్ పోలీసు స్టేష‌న్‌లో ఆయ‌నపై కేసు న‌మోదు చేశారు. ఐపీసీలోని 153ఏ, 295ఏ సెక్ష‌న్ల కింద కేసు ఫైల్ చేశారు. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ను కించ‌ప‌రుస్తూ ఫ్రాన్స్‌లో కార్టూన్లు వేసిన నేప‌థ్యంలో అక్క‌డ ముస్లింలు ఇటీవ‌ల దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఇటీవ‌ల నీస్ న‌గ‌రంలోని ఓ చ‌ర్చిలోకి వెళ్లిన ఓ దుండ‌గుడు క‌త్తితో దాడి చేసి ముగ్గుర్ని హ‌త‌మార్చాడు.ఈ ఘటనను సమర్థించిన కారణంగా ఆయనపై కేసు నమోదైంది.