బుధవారం అమేథీలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్షులు  రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో ఓ అరుదైన దృశ్యం ఆవిషృతమైంది. తమ్ముడి నామినేషన్ కార్యక్రమంలో తన పిల్లలతో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఈ సందర్భంగా ఆమె మిరయ వాంద్రా, రిహాన్ వాంద్రాలతో కలిసి ఎలక్షన్ సెల్ఫీ దిగుతూ కెమెరా కంటికి చిక్కారు. 

ఈ ఫోటోను కాంగ్రెస్ పార్టీ  తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రియాంక తన పిల్లలతో కలిసి ఆనంద క్షణాలను గడుపుతున్నట్లు పేర్కొంటూ చేసిన ఈ ట్వీట్ పై ప్రియాంకా కూడా స్పందించారు. ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ తాను ఇప్పటివరకు ప్రయత్నించిన సెల్పీల్లో ఇది  అద్భుతమైందని ఆమె పేర్కొన్నారు. 

ఉత్తప ప్రదేశ్ అమేథీ నుండి మరోసారి బరిలోకి దిగుతున్న రాహుల్ గాంధీ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసివెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తల్లి సోనియా, చెల్లి ప్రియాంక, బావ రాబర్ట్ వాద్రా తో పాటు వారి పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేపడుతూ వెళ్లి ఎన్నికల అధికారికి రాహుల్ నామినేషన్ పత్రాలను అందించారు. 

ఇటీవల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో అధికారికంగా ప్రవేశించిన ప్రియాంక తన రాజకీయ చతురతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆమె అక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మొత్తంగా యూపీలో ప్రధాని మోదీ, బిజెపి హవాను తగ్గించి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునరుత్తేజం చేయడానికి ప్రియాంక ప్రయత్నిస్తున్నారు.