కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీ లోడీరోడ్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన గడువుకు ముందే ఆమె తన అధికారిక భవనాన్ని ఖాళీ చేస్తూ.. తన వ్యక్తిగత సామాగ్రిని తల్లి సోనియా గాంధీ నివాసానికి తరలించారు.

10 జన్‌పథ్ రోడ్డులో ఉన్న సోనియా గాంధీ నివాసానికి ఇప్పటికే సామాన్లను తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ బంగ్లాను ఆగస్టు 1 నాటికి ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

లోడీ ఎస్టేట్‌లోని 35వ నెంబర్ ప్రభుత్వ బంగ్లాలో ప్రియాంకా నివసిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె తన మకాంను ఢిల్లీ నుంచి యూపీ రాజధాని లక్నోకి మార్చాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.

కాగా కేంద్ర ప్రభుత్వం  ప్రియాంకకు ఇప్పటికే ఎస్పీజీ సెక్యూరిటీని తొలగించింది. అయితే లక్నోలో నివాసం ఏర్పాటు చేసుకుంటే.. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు.. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు వీలు కలుగుతుందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.