ఉత్తరప్రదేశ్:  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూతురు, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీకి ఉత్తర ప్రదేశ్ లో చేదు అనుభవం ఎదురయ్యింది. పోలీసులు తనపై దాడి చేశారంటూ స్వయంగా  ప్రియాంకే మీడియా ముందుకు వచ్చారు. కనీసం ఓ మహిళ అని కూడా చూడకుండా పోలీసులు తనపట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని ప్రియాంక ఆరోపించారు.

యూపీ అల్లర్లలో అరెస్టయిన వారిని కుటుంబాలను పరామర్శించడానికి ప్రియాంక లక్నోలో పర్యటిస్తున్నారు. అయితే కార్యకర్తలతో కలిసి స్కూటీపై వెళుతుండగా తమను పోలీసులు అడ్డుకున్నారని... అకారణంగా తమపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. తనతో పాటు స్కూటీ నడుపుతున్న నాయకుడిని కూడా మెడ పట్టుకుని తోసేశారని అన్నారు. మాజీ ఐపిఎస్ అధికారి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వస్తుండగా ఆ ఘటన చోటుచేసుకుందని ప్రియాంక వివరించారు. 

read more  ప్రతి సంవత్సరం రైలు ప్రమాదాల వల్ల మరణాలు ఎన్నో తెలుసా...?
 
ఇవాళ ఉదయం కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. లక్నోలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్న ప్రియాంకను కలుసుకోవాలని ఓ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. సెక్యూరిటీని దాటుకుని వచ్చి ప్రియాంకను కలుసుకుని కాస్సేపు నానా హంగామా సృష్టించాడు. దీంతో వేదికపై వున్న నాయకులు, పోలీసు సిబ్బంది అతన్ని లాగి పక్కకు పంపించే ప్రయత్నం  చేశారు. 

 ప్రియాంక మాత్రం వారిని వారించి కార్యకర్తతో ముచ్చటించారు. అతడి సమస్య గురించి అడిగి తెలుసుకుని పంపించారు.  అయితే ఈ ఘటన ప్రియాంక సెక్యూరిటీ డొల్లతనాన్ని తెలియజేస్తోంది. అతి సునాయాసంగా సదరు కార్యకర్త ఆమెను చేరుకొన్న ఘటన ప్రియాంక సెక్యూరిటీ ఎలా వుందో తెలియజేసింది. 

read more  దుర్యోధన, దుశ్శాసన: బీజేపీ నేతలపై యశ్వంత్ సిన్హా మహాభారతం పంచ్

కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. ఈ నిరసన కార్యక్రమాలను చేపడుతున్న విద్యార్ధులు, స్థానికులకు మద్ధతుగా  ప్రియాంక గాంధీ ఇండియా గేట్ వద్ద ఆందోళనకు దిగారు. జామియా యూనివర్సిటీలో విద్యార్ధులపై లాఠీ ఛార్జీకి నిరసనగా ఆమె బైఠాయించారు.

 విద్యార్ధుల పట్ల అమానుషుంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. ప్రజాగళాన్ని వినేందుకు కేంద్రం భయపడుతోందని.. యువత ధైర్యాన్ని బీజేపీ ప్రభుత్వం అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని ప్రియాంక ఆరోపించారు.ఢిల్లీలో ఆందోళనలపై కూడా ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రియాంక... బీజేపీ ప్రభుత్వం పిరికి  పంద ప్రభుత్వమని విమర్శించారు. యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి విద్యార్ధులపై దాడి చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు.

 ఉద్రిక్తతల సమయంలో ప్రభుత్వం.. ప్రజల బాధలను వినాల్సిన అవసరం ఉంది కానీ దాడులు చేయడం సరికాదని ప్రియాంక వ్యాఖ్యానించారు. ఈశాన్య భారతంతో పాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని విద్యార్ధులను, జర్నలిస్టులను బీజేపీ ప్రభుత్వం అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. యువత గొంతును ప్రధాని మోడీ అణిచివేయలేరన్నారు.