రాహుల్ గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం దేశానికి, ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని.. ‘అహంకారపూరిత ప్రభుత్వానికి’ వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. 

రాహుల్ గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం దేశానికి, ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని.. ‘అహంకారపూరిత ప్రభుత్వానికి’ వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఆ పార్టీ అధిష్టానం నిరసనలకు పిలునిచ్చింది. రాహుల్‌ గాంధీకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఈరోజు సత్యాగ్రహ దీక్ష జరపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఒక రోజు ‘‘సంకల్ప్ సత్యాగ్రహ’’ దీక్షను చేపట్టింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. జాతీయ ఐక్యత కోసం వేల కిలోమీటర్లు నడిచిన అమరులైన ప్రధాని కుమారుడు దేశాన్ని ఎప్పటికీ అవమానించలేరని చెప్పారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ప్రధాని మోదీని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ అనర్హత వేటు పడిందని.. ఈ చర్య వెనుక ఉన్నవారికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు. 

‘‘నా కుటుంబ రక్తమే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించింది.. ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం ఏం చేయడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం.. కాంగ్రెస్‌లోని గొప్ప నాయకులు ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునాది వేశారు.. మమ్మల్ని భయపెట్టగలరని అనుకుంటే వాళ్లు పొరపాటు పడ్డట్టే.. మేము భయపడం. సమయం వచ్చింది.. మేము ఇకపై మౌనంగా ఉండం’’ అని ప్రియాంక గాంధీ అన్నారు. 

అమరవీరుడు అయిన ప్రధాని కొడుకు దేశాన్ని అవమానించగలడా అని ప్రశ్నించిన ప్రియాంక గాంధీ.. ఇది దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రధానిని అవమానించడమేనని అని అన్నారు. ‘‘ఒక అమరవీరుడి కొడుకును దేశ వ్యతిరేకి, మీర్ జాఫర్ అని పిలిచారు. మీరు పార్లమెంటులో ఆయన తల్లిని అవమానించారు. ఈ కుటుంబం ‘నెహ్రూ’ ఇంటిపేరును ఎందుకు ఉపయోగించరని పార్లమెంటులో ప్రధాని అడుగుతుంటారు. మీరు మొత్తం ఈ కుటుంబాన్ని, కాశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని అవమానిస్తున్నారు. కానీ మీ మీద ఎలాంటి కేసు లేదు. మీ మీద కేసు గానీ, రెండేళ్ళ జైలు శిక్ష గానీ.. మిమ్మల్ని ఎవరూ అనర్హులుగా చేయరు. ఎందుకు?’’ అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. 

ఈ రోజు వరకు వారు తమ కుటుంబాన్ని అవమానించారని.. తాము మౌనంగానే ఉన్నామని ప్రియాంక గాంధీ అన్నారు. ఒక వ్యక్తిని ఎంతగా అవమానిస్తారని ప్రశ్నించారు. అజ్ఞాతవాసానికి పంపబడిన రాముడు ‘‘పరివార్వాది’’ కాదా అని ప్రశ్నించారు. దేశ సంపదను దోచుకుని ఒకరికి ఇస్తున్నారని ఆరోపించారు. ‘‘అహంకార నియంతలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు.. వారు ప్రశ్నలు అడిగేవారిని అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మొత్తం క్యాబినెట్, ప్రభుత్వం, ఎంపీలు ఒక వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. విచారణ జరపడం లేదు. ఆర్థిక వ్యవస్థ అంత సరిగా ఉంటే ప్రజలు ఇంకా ఎందుకు నిరుద్యోగులుగా ఉన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు లక్షలాది మంది నిరుద్యోగులు రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. దేశాన్ని ఏకం చేయడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచే వ్యక్తి దేశాన్ని అవమానించగలడా?. రాహుల్ గాంధీ పేదలు, యువత మరియు మహిళలు తమ హక్కులను పొందాలని కోరుకుంటున్నారు. వారికి సంబంధించినది వారి చేతుల్లోకి వెళ్లాలని... పెద్ద మనిషి, ప్రధాని స్నేహితుడికి కాదు’’ అని ప్రియాంక అన్నారు. 

‘‘రాహుల్ గాంధీ ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలైన హార్వర్డ్, కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నారు. అయినప్పటికీ వారు ఆయనను "పప్పు" అని పిలుస్తారు. ఆయన పప్పు కాదని.. లక్షలాది మంది ఆయనతో నడుస్తున్నారని తెలుసుకున్నప్పుడు, పార్లమెంటులో అతను లేవనెత్తిన సమాధానాలు లేని ప్రశ్నలకు వారు కలవరపడ్డారు. కేవలం ఒక వ్యక్తిని ఆపడానికి వారు ఇదంతా చేయాల్సి వచ్చింది. ఈ దేశ ప్రధాని పిరికివాడు. నన్ను జైలుకు తీసుకెళ్లండి కానీ నిజమేమిటంటే ఈ దేశ ప్రధాని పిరికివాడు. అతను తన అధికారం వెనుక దాక్కున్నారు. అహంకారి. కానీ ఈ దేశ సంప్రదాయం ఏమిటంటే దురహంకారి రాజుకు ప్రజలు సమాధానం ఇవ్వడం. ఈ దేశం అహంకారి రాజును గుర్తిస్తుంది.. ఈ దేశానికి నిజం తెలుసు’’ అని ప్రియాంక పేర్కొన్నారు. 

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నందున మీడియా తమ బాధ్యతను అర్థం చేసుకోవాలని ప్రియాంక గాంధీ కోరారు. ప్రశ్నించే వ్యక్తిని ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తే.. అది దేశానికి లేదా దాని ప్రజాస్వామ్యానికి సరికాదు. సమయం వచ్చింది.. దారో మత్ (భయపడకండి) అని ప్రియాంక గాంధీ కామెంట్ చేశారు.