కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అభినందనలు తెలిపారు. కర్ణాటక ప్రజలు వారి సమస్యలను పరిష్కరించే రాజకీయాలను, వారి సమస్యలను చర్చించే రాజకీయాలను కోరుకుంటున్నారని నిరూపించారని చెప్పారు.

కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అభినందనలు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై ఆమె స్పందించారు. ఈరోజు ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలు వారి సమస్యలను పరిష్కరించే రాజకీయాలను, వారి సమస్యలను చర్చించే రాజకీయాలను కోరుకుంటున్నారని నిరూపించారని చెప్పారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా సందేశం పంపారని తెలిపారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఫిరాయింపు రాజకీయాలు ఇక సాగవని నిరూపించారని చెప్పారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో తాము కర్ణాటకలో విజయం సాధించామని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌లో జోష్ నింపిందని అన్నారు. తాను దాదాపు నెల రోజుల పాటు కర్ణాటకలో ఉన్నానని.. వారి నాయకత్వంలో పనిచేశానని చెప్పారు. శివకుమార్, సిద్దరామయ్య‌తో కాంగ్రెస్ శ్రేణులకు అభినందనలు అని చెప్పారు. 

‘‘నేను చెప్పినట్లు కర్ణాటకలో అధికారంలోకి రావడం చాలా పెద్ద బాధ్యత. మేము కొన్ని హామీలతో ప్రజల వద్దకు వెళ్లాము. వాటిని నెరవేర్చాలి. మేము ప్రజల కోసం పని చేయాలి. తరువాత ఏమి జరుగుతుందో ప్రజలు మాకు చెబుతారు’’ అని ప్రియాంక గాంధీ అన్నారు. 

ఇక, అంతకుమందు ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రియాంక గాంధీ.. ‘‘కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చినందుకు కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు! అవినీతి, మతతత్వం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కన్నడిగులు చేతులు ఎత్తారు. మన దేశాన్ని ఏకం చేయడానికి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు, కర్ణాటక కాంగ్రెస్ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కష్టానికి ప్రతిఫలం లభించింది. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. జై కర్ణాటక, జై కాంగ్రెస్’’ అని పేర్కొన్నారు.