Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుంది. నేడు రాహుల్ భారత్ జోడో యాత్రలో ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. 

Priyanka gandhi Joins Rahul gandhi Bharat Jodo Yatra
Author
First Published Nov 24, 2022, 10:56 AM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుంది. నేడు రాహుల్ భారత్ జోడో యాత్రలో ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. రాహుల్ తన పాదయాత్రను ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్‌లోని బోర్గావ్ గ్రామం నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రెహాల్‌లతో కలిసి.. రాహుల్‌తో పాటు పాదయాత్రలో అడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను  కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. పాదయాత్రలో పాల్గొన్న ప్రియాంక.. తన సోదరుడు రాహుల్‌తో నవ్వుతూ కనిపించారు. ఇద్దరు చాలా ఉత్సాహంగా అడుగులు వేస్తూ ముందుకు సాగారు. 

ప్రియాంక గాంధీ రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. యాత్రలో పాల్గొన్నవారికి, యాత్ర మార్గంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ కూడా భారత్‌ జోడో యాత్రలో పాల్గొని రాహుల్‌తో కలిసి నడిచారు. మరికొద్ది రోజుల్లోనే భారత్ జోడో యాత్ర రాజస్తాన్‌లో ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. 

ఇక, భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం బుర్హాన్‌పూర్‌లో  బహిరంగ సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజల ‘మన్ కీ బాత్’ వినడానికి తాము దాదాపు ఎనిమిది గంటల పాటు నడిచి, రోజూ సగటున 25 కిలోమీటర్లు తిరుగుతున్నామని చెప్పారు.  ‘‘మేము యాత్ర మధ్య ప్రజలతో మమేకమవుతాము. మేము ఎనిమిది గంటల పాటు ప్రజల 'మన్ కీ బాత్' వింటాం. సుమారు 15 నిమిషాలు మాట్లాడుతాము. ప్రధానమంత్రి 'మన్ కీ బాత్' లాగా కాదు.. రోజంతా రైతులు, యువత, మహిళలు, కూలీలు, చిన్నతరహా వ్యాపారుల మదిలో ఏముందో వింటాం.

 

మేం ఈ యాత్రను కన్యాకుమారి నుండి ప్రారంభించాం. మేము యాత్రను ప్రారంభించినప్పుడు ప్రతిపక్షాల నాయకులు విమర్శలు చేశారు. ఇప్పుడు మేము మధ్యప్రదేశ్‌కు వచ్చాము. మేము ఇక్కడ సుమారు 370 కిలోమీటర్లు నడుస్తాము. ఈ యాత్ర ద్వారా శ్రీనగర్‌కు చేరుకుంటాం. అక్కడ మా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తాం, ఎవరూ అడ్డుకోలేరు’’ అని రాహుల్ గాంధీ చెప్పారు. ఇక, రాహుల్ పాదయాత్ర మధ్యప్రదేశ్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలు, 26 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగనుంది. వీటిలో ఎక్కువ భాగం అక్కడి అధికార బీజేపీ చేతిలో ఉన్నాయి.

ఇక, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో సాగుతున్న సమయంలో ఆయన తల్లి సోనియా గాంధీ కూడా పాల్గొన్న సంగతితెలిసిందే. అనారోగ్య కారణాలతో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోనియా గాంధీ.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో సైతం పాల్గొనలేకపోయారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనే పార్టీ బహిరంగ కార్యక్రమంలో గాంధీ పాల్గొని చాలా కాలం అయ్యింది. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ పాల్గొనడంతో.. కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. పాదయాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ షూ లేస్‌ను రాహుల్ టై చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios