త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు తక్షణమే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే నేడు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్షకు దిగారు. 

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు తక్షణమే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే నేడు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్షకు దిగారు. ఈ సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, జైరామ్ రమేష్, అజయ్ మాకెన్.. తదితరులు పాల్గొన్నారు. ‘‘అగ్నిపథ్ స్కీమ్ వాపస్ లో’’ (అగ్నిపథ్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలి) అని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌ నేతలు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. 

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన ఈ సత్యాగ్రహ దీక్షలో ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న ప్రియాంక గాంధీ అగ్నిపథ్‌ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలని ఫ్లకార్డు‌ను చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. ఇక, మరికాసేపట్లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా జంతర్ మంతర్ వద్దకు చేరుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్ వద్ద పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని భారీగా మోహరించారు. మరోవైపు పలు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్షకు దిగారు. 

ఇక, అగ్నిపథ్ స్కీమ్ తీసుకురావడంపై ట్విట్టర్ వేదికగా కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘‘పదే పదే ఉద్యోగాలపై తప్పుడు ఆశలు కల్పించడం ద్వారా ప్రధాని దేశంలోని యువతను నిరుద్యోగం అనే 'అగ్నిబాట'లో నడిచేలా ఒత్తిడి తెచ్చారు. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. కానీ యువతకు పకోడీలు వేయించే జ్ఞానం మాత్రమే వచ్చింది. దేశ ఈ పరిస్థితికి ప్రధానమంత్రి మాత్రమే బాధ్యత వహించాలి’’ అని రాహుల్ డిమాండ్ చేశారు. 

ప్రధాని మోదీ 'మాఫీవీర్'గా మారి.. యువ‌త డిమాండ్‌కు త‌లొగ్గుతారని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. ‘‘గత ఎనిమిదేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం 'జై జవాన్‌, జై కిసాన్‌' విలువలను అవమానపరిచింది. సాగు చట్టాలను ప్రధానమంత్రి రద్దు చేసుకోకతప్పదని నేను గతంలో చెప్పాను. అదే తరహాలో తాజాగా ఆయన దేశ యువత నిర్ణయాన్నీ అంగీకరించాల్సిందే. క్షమాపణలు చెప్పి అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాల్సిందే" అని రాహుల్ ట్వీ‌ట్‌లో పేర్కొన్నారు. ఇక‌, నిరుద్యోగ యువ‌త బాధ‌లు, వారిలో నెల‌కొన్న నైరాశ్యాన్ని కేంద్రం ప్ర‌భుత్వం అర్ధం చేసుకోవ‌డం లేద‌ని.. త‌క్ష‌ణమే అగ్నిప‌థ్ స్కీంను వెన‌క్కితీసుకోవాల‌ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాధ్రా డిమాండ్ చేశారు.