Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక ప్రభుత్వం హామీ .. బంద్ విరమించిన ప్రైవేట్ రవాణా సంఘాలు.. రోడ్డెక్కిన ట్యాక్సీలు, బస్సులు

తమ డిమాండ్లను నెరవేరుస్తామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రైవేట్ రవాణా సంఘాల సమాఖ్య బెంగళూరు బంద్‌ను విరమించుకుంది. రాష్ట్రంలోని ప్రయివేటు రవాణా వ్యవస్థకు కూడా ‘‘శక్తి పథకాన్ని’’ వర్తింపజేయాలనేది యూనియన్ల ప్రధాన డిమాండ్. 

private transport associations Bangalore bandh called off after Karnataka government's intervention ksp
Author
First Published Sep 11, 2023, 6:09 PM IST

తమ డిమాండ్లను నెరవేరుస్తామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రైవేట్ రవాణా సంఘాల సమాఖ్య బెంగళూరు బంద్‌ను విరమించుకుంది. ఐటీ రాజధాని అంతటా క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఇతర ప్రైవేట్ బస్సులు నిలిచిపోవడంతో ఉదయం నుంచి ప్రైవేటు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మహిళలకు ఉచిత రవాణా పథకం వల్ల తీవ్రంగా నష్టపోతున్నందున రాష్ట్రంలోని ప్రయివేటు రవాణా వ్యవస్థకు కూడా ‘‘శక్తి పథకాన్ని’’ వర్తింపజేయాలనేది యూనియన్ల ప్రధాన డిమాండ్. అయితే శక్తి పథకాన్ని ప్రైవేట్ బస్సులకు విస్తరించడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. 

కర్నాటకలో తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్న బైక్ ట్యాక్సీలను నిషేధించాలని కూడా ఆటో యూనియన్లు డిమాండ్ చేశాయి. అంతేకాదు .. తమ బైక్ ట్యాక్సీ నిషేధ డిమాండ్‌పై న్యాయపరమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వానికి తెలిపింది. డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ఆటో డ్రైవర్లకు బీమా, వాణిజ్య వస్తువుల వాహనాలపై జీవితకాల పన్ను తదితర డిమాండ్లు ఉన్నాయి. గత సమావేశాల్లో మొత్తం 30 డిమాండ్లను కార్మిక సంఘాలు రవాణా శాఖకు అందించాయి.

అంతకుముందు, జూలై 24న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో రవాణా సంఘాలు చర్చలు జరిపాయి, వారు తొలుత జూలై 27న నిరసనను షెడ్యూల్ చేయడానికి మూడు రోజుల ముందు ఈ భేటీ జరిగింది. అయితే, సమస్యలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లి ఆయనతో చర్చిస్తానని రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఎంతగా నచ్చజెప్పినా వినకపోవడంతో సెప్టెంబర్ 11న ఒకరోజు సమ్మె చేయాలని ప్రైవేట్ రవాణా సంఘాలు నిర్ణయించాయి. అయితే డిమాండ్ల సాధనకు మంత్రి రామలింగారెడ్డి హామీ ఇవ్వడంతో సోమవారం మధ్యాహ్నం బంద్‌ను విరమించారు.

Follow Us:
Download App:
  • android
  • ios