జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడగా.. అతని కడుపులో సూసైడ్ నోట్ లభించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ సెంట్రల్ జైల్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రకు చెందిన అస్గర్ మన్సూరీ అనే వ్యక్తి  హత్యా నేరంతో నాసిక్  సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మరి కొన్ని నెలల్లో శిక్షా పూలం పూర్తయ్యి.. ఆయన విడుదల కానున్నాడు. కాగా.. అలాంటి వ్యక్తి అనూహ్యంగా జైలు గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అస్గర్... అక్టోబర్ 7వ తేదీన బలవన్మరణానికి పాల్పడగా.. తర్వాత అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే.. పోస్టుమార్టం చేస్తున్న సమయంలో అతని కడుపులో సూసైడ్ నోట్ బయటపడింది. పాలిథిన్‌ కవర్లో చుట్టిన ఆ సూసైడ్‌ నోట్‌లో తన చావుకు గల కారణాలను అస్గర్ అందులో వివరించడం గమనార్హం.

జైలు సిబ్బంది వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్‌లో పేర్కొన్నాడు. కొద్దిరోజుల క్రితం జైలు నుంచి విడుదలైన మరి కొంతమంది ఖైదీలు సైతం జైలు సిబ్బంది వేధింపులపై అధికారులు, ముంబై హైకోర్టుకు లేఖ రాశారు. ఈ సంఘటనపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. చదవటం, రాయటం రాని అస్గర్‌ వేరే వ్యక్తి సహాయంతో ఆ సూసైడ్‌ నోట్‌ రాయించుకుని ఉంటాడని భావిస్తున్నారు.