Asianet News TeluguAsianet News Telugu

కశ్మీర్‌లో ఇక నవశకం..ఆంక్షలు కొంతకాలమే, త్వరలోనే ఎన్నికలు: మోడీ

కశ్మీర్ విభజనతో సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ , శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటి దేశభక్తుల కల సాకారమైందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు ఇన్నాళ్లు అభివృద్ధికి దూరంగా ఉన్నారని.. కశ్మీర్ విషయంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నామని మోడీ తెలిపారు. 
 

Prime minister Narendramodi address nation after scrapping of article 370
Author
New Delhi, First Published Aug 8, 2019, 8:07 PM IST

కశ్మీర్ విభజనతో సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ , శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటి దేశభక్తుల కల సాకారమైందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు ఇన్నాళ్లు అభివృద్ధికి దూరంగా ఉన్నారని.. కశ్మీర్ విషయంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నామని మోడీ తెలిపారు.

తద్వారా జమ్మూకాశ్మీర్‌లో కొత్త శకం ప్రారంభమైందని.. కశ్మీర్, లడఖ్ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్, లడఖ్ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఇంతకాలం చర్చించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టికల్ 370, 35ఏలను అడ్డుపెట్టుకుని జరిగిన అన్యాయం వెనుక పాకిస్తాన్ హస్తం వుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ అధికరణ కారణంగా ఉగ్రవాదులకు, అవినీతిపరులకు మేలు జరిగిందని.. వారికి ఒక ఆయుధంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు.

పార్లమెంట్ చట్టాలు దేశంలోనే ఒక ప్రాంతంలో అమలు కాని పరిస్ధితి వుందని..  కానీ దేశమంతా ప్రయోజనం చేకూర్చే చట్టాలు, కశ్మీర్‌ ప్రజలకు మాత్రం ఉండవని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీలు చేసిన నేరమేంటి...? కశ్మీరీ మహిళలు, పిల్లలు చేసిన తప్పేంటని ఆయన ప్రశ్నించారు.

దేశమంతా దళితుల మీద జరిగే అన్యాయాలను అడ్డుకోవడానికి చట్టాలున్నాయని, మైనార్టీల సంరక్షణకు చట్టాలున్నాయని, కార్మికులకు కనీస వేతన చట్టాలున్నాయని..  కానీ ఇవేవి కశ్మీర్‌లో మాత్రం పనిచేయవని ప్రధాని తెలిపారు. దేశమంతా ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయని.. కానీ కాశ్మీర్‌లో ఇవేవి ఉండవన్నారు.

ఆర్టికల్ 370 రద్దయ్యింది కనుక కాశ్మీరీలకు ఇక నుంచి న్యాయం జరుగుతుందని ప్రధాని తేల్చి చెప్పారు. దేశమంతా కార్మికులకు, పోలీసులకు అందే సదుపాయాలన్నీ తక్షణం కశ్మీర్‌లో కూడా అందిస్తామని మోడీ వెల్లడించారు.

ఇక నుంచి కశ్మీర్‌కు పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్‌లోని భారీ పరిశ్రమలు తరలివస్తాయని.. అక్కడి విద్యార్ధులకు విద్యావకాశాలు పెరుగుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. బాగా ఆలోచించే కాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశామని.. కొద్దికాలంగా రాష్ట్రపతి పాలనలో ఉండటం వల్ల కాశ్మీర్‌లో పరిస్ధితి మెరుగుపడిందని, పాలనలో పారదర్శకత వచ్చిందని, విద్యాసంస్ధలు పెరిగి, ఇతర సదుపాయాలు కూడా మెరుగుపడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు.

జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఇప్పటివరకు ఆర్టికల్ 370తో ఏం ఒరిగిందని ప్రధాని ప్రశ్నించారు. 42 వేల మంది జీవితాలు నాశనమయ్యాయని... జమ్మూకాశ్మీర్ ప్రజలు, యువత చాలా హక్కులు కోల్పోయారని మోడీ తెలిపారు.

కాశ్మీర్‌కు సాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. జరుగుతున్న అన్యాయంపై ఎవరూ మాట్లాడలేదని.. ఇక నుంచి కాశ్మీర్‌లో సుపరిపాలన అందిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో కేంద్రపాలన తాత్కాలికమేనని.. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రజలకు సురక్షితమైన భవిష్యత్తు ముందుందన్నారు.

కాశ్మీర్‌లో దశాబ్ధాలుగా లక్షలాదిమందికి చట్టసభల్లో ప్రవేశించే అవకాశమే లేదని.. 1947లో దేశ విభజన సమయంలో పాక్ నుంచి వచ్చి కాశ్మీర్‌లో స్ధిరపడిన వారికి అన్యాయం జరిగిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైనా కాశ్మీర్‌లో గతంలోలాగే అసెంబ్లీ, సీఎం, కేబినెట్ ఉంటాయని మోడీ స్పష్టం చేశారు.

కాశ్మీరీల భవిష్యత్తు కోసం కొంతకాలం ఆంక్షలు తప్పవని.. ఎక్కువ కాలం కాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా వుంచాల్సిన అవసరం రాదన్నారు. త్వరలోనే పూర్తి పారదర్శకత, నిజాయితీతో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ను పునరుద్ధరించాలని తాను గవర్నర్‌ను కోరుతానన్నారు.

కాశ్మీర్ ప్రజలు వేర్పాటువాదాన్ని జయించి ముందడుగు వేస్తారనే నమ్మకం తనకు ఉందని ప్రధాని తెలిపారు. కాశ్మీర్ అభివృద్ధికి అక్కడి యువత నాయకత్వం వహిస్తారని.. కాశ్మీర్, లడఖ్ యువతకు ఇదే తన ఆహ్వానమన్నారు.

కాశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొంటాయాని.. ప్రపంచమంతా షూటింగ్‌ల కోసం అక్కడికే వస్తుందని తెలుగు, తమిళ, హింది చిత్ర పరిశ్రమలు కాశ్మీర్‌కు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ సంస్థలు సైతం తమ కార్యకలాపాలకు కాశ్మీర్‌ను కేంద్రంగా మార్చుకోవాలని ప్రధాని కోరారు.

కొత్త స్పోర్ట్స్ అకాడమీలు, స్టేడియంలు కాశ్మీర్, లడఖ్‌లలో ఏర్పాటవుతాయన్నారు. కాశ్మీర్‌లో కుంకుమ పువ్వు, కాశ్మీర్ కహ్వాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని మోడీ తెలిపారు. లడఖ్ ఆధ్యాత్మిక, అడ్వెంచర్, పర్యావరణ టూరిజం, సౌరశక్తి ఉత్పాదక కేంద్రంగా మారాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాశ్మీర్, లడఖ్‌ల భవిష్యత్ దేశ ప్రజలందరి బాధ్యతన్నారు. కాశ్మీర్ ప్రగతిని అడ్డుకోవాలని చూసే అరాచక శక్తులకు అక్కడి ప్రజలే సమాధానం చెప్పాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించే వారందరికీ అభివృద్ధి ఫలాలు అందుకునే హక్కుందని ఆయన స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios