దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించనున్నారు. 

ప్రధాని మోదీ నేడు కీలకమైన ఘ‌ట్టాల‌కు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పున‌ర్ద‌ర‌ణ ప్రాజెక్ట్‌లో భాగంగా గురువారం సాయంత్రం కర్తవ్య పథ్, డ్యూటీ పాత్ ప్రారంభోత్సవంతోపాటు ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. 

ఈ ఏడాది ప్రారంభంలో పరాక్రమ్ దివస్ (జనవరి 23) సందర్భంగా.. నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ చేసిన కృషికి నిజమైన నివాళి అవుతుందని, దేశం ఆయనకు రుణపడి ఉండేందుకు చిహ్నంగా నిలుస్తుందని పీఎంవో పేర్కొంది.

ఈ విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత యువ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఈ విగ్ర‌హాన్ని రూపొందించడానికి 1,665 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణలోని ఖమ్మం నుంచి గ్రానెట్ రాయిని ఢిల్లీకి తెప్పించారు. 65 మెట్రిక్ టన్నుల బరువు భారీ రాయిని త‌ర‌లించ‌డానికి 140 చక్రాలతో 100 అడుగుల పొడవు ఉన్న ట్రక్కును ప్రత్యేకంగా తయారు చేయించినట్లు అధికారులు తెలిపారు. 

1968 వరకు ఇంగ్లండ్ రాజు 5వ జార్జ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోట 28 అడుగుల ఉన్న నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక పరికరాలు ఉపయోగించి పూర్తి భారతీయ సంప్రదాయపద్ధతిలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దినట్టు.. ఇది దేశంలోని ఎత్తైన ఏకశిలా విగ్రహాల్లో ఒకటిగా నిలిచింద‌ని అధికారులు తెలిపారు. 

 కర్తవ్య పథ్ ప్రారంభం..

అదేవిధంగా .. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పునరుద్ధరణ ప్రాజెక్ట్ లో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు పునరుద్ధరించిన కర్తవ్యపథ్ మార్గ్, డ్యూటీ పాత్ ను ప్రారంభించనున్నారు. 'కర్తవ్య పథ్ అనేది రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు ఉన్న మార్గం. ఈ రహదారికి ఇరువైపులా పచ్చిక బయళ్ళు, పచ్చదనంతో పాటు, పాదచారుల కోసం ఎర్ర గ్రానైట్ రాళ్లతో రూపొందించిన కాలినడక మార్గం. దాని గొప్పతనాన్ని పెంచడానికి.. ఈ మార్గంలో పునర్నిర్మించిన కాలువలు, స్టేట్ ఫుడ్ స్టాల్స్, కొత్త సదుపాయాలతో కూడిన బ్లాక్‌లు, సేల్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. 

రాజ్‌పథే కర్తవ్య పథ్ గా మార్పు 

న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి స్వీకరించిన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా 'రాజ్‌పథ్' పేరును 'కర్తవ్య పథ్ గా పేరు మార్చారు. ఇప్పుడు ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మొత్తం ప్రాంతాన్ని 'డ్యూటీ పాత్'గా పిలుస్తున్నారు.

పూర్వపు 'రాజ్‌పథ్' అధికారానికి ప్రతీక అని, దానికి 'డ్యూటీ పాత్'గా పేరు మార్చడం మార్పుకు సంకేతమని, ప్రజా స్వామ్యానికి, సాధికారతకు ఉదాహరణ అని పిఎంఓ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 'కర్తవ్య పథ్ ' ప్రారంభోత్సవం అనంత‌రం .. నేతాజీ విగ్రహావిష్కరణ జ‌రుగుతోంది.

Scroll to load tweet…