న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 3వ తేదీన రోహతంగ్ లో అటల్  టన్నెల్ ను  ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే హైవేలలో అతి పెద్ద టన్నెల్ (సొరంగం)గా పేరొందింది.

ఈ టన్నెల్ పొడవు 9.02 కి.మీ. మనాలీ నుండి లాహౌల్ -స్పితి లోయను ఏడాది పొడవునా ఈ సొరంగమార్గం కలుపుతోంది.ప్రతి ఏటా ఆరు మాసాల పాటు ఈ లోయ ప్రాంతం భారీ మంచు కారణంగా కప్పబడి ఉంటుంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతో ఈ సొరంగ మార్గ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సొరంగంతో మంచు కురిసిన కూడ రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు.

హిమాలయాల్లోని పిర్ పంజాల్ శ్రేణిలో సముద్రమట్టానికి 10 వేల మీటర్ల ఎత్తులో  అల్ట్రా మోడరన్ స్పెసిఫికేషన్లతో ఈ టన్నెల్ ను నిర్మించారు.ఈ సొరంగం ద్వారా మనాలి.. లే మధ్య 46  కి.మీ దూరాన్ని తగ్గించనుంది. అంతేకాదు 4 నుండి 5 గంటల సమయం కూడ తగ్గనుంది.

అటల్ టన్నెల్ దక్షిణ పోర్టల్  మనాలీకి 25 కి.మీ దూరంలో ఉంది. ఉత్తర పోర్టల్ లాహౌల్ లోయని నిస్సూ గ్రామానికి సమీపంలోని టెలింగ్ వద్ద ఉంది.ఇది గుర్రపు షూ ఆకారంలో నిర్మించబడింది. సింగిల్ ట్యూబ్ డబుల్ లేన్ టన్నెల్ . 

ఇది 10.5 మీటర్ల వెడల్పు, 3.6x2.25 మీటర్ల ఫైర్ ఫ్రూఫ్ ఎమర్జెన్సీ టన్నెల్ ను ప్రధాన సొరంగంలోనే నిర్మించారు.ఈ టన్నెల్ లో రోజుకు 3 వేల కార్లు, 1500 ట్రక్కులు గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణించేలా నిర్మించినట్టుగా అధికారులు తెలిపారు.

ఈ టన్నెల్ నిర్మించాలని వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో నిర్ణయించారు. 2000 జూన్ 3న అప్పటి వాజ్ పేయ్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ సొరంగం నిర్మాణం కోసం 2002 మే 26న శంకుస్థాపన జరిగింది.

2019 డిసెంబర్ 24న ఈ టన్నెల్ కు అటల్ టన్నెల్ గా పేరు పెట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.ఈ టన్నెల్ ను ప్రారంభించిన తర్వాత స్పితిలోని సిసు , సోలాంగ్ లోయల్లో నిర్వహించే బహిరంగ కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు.