ఢిల్లీ: అమెరికా పర్యటన అనంతరం భారతదేశం యెుక్క ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా మరింత పెరిగిందని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. 2014 తర్వాత భారత్‌దేశం పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారిందని చెప్పుకొచ్చారు. 

అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీకి  పాలెం విమానాశ్రయంలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతోపాటు పలువురు కేంద్రమంత్రులు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.  

అనంతరం పాలెం ఎయిర్ పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న పీఎం నరేంద్రమోదీ  హౌడీ-మోడీ కార్యక్రమంతో అమెరికా పర్యటన విజయవంతమైందని చెప్పుకొచ్చారు. అమెరికా పర్యటన ఎంతో విజయవంతమైందన్నారు. 

తనకుఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మోదీ. అమెరికా పర్యటనకు విశిష్టత ఉందని చెప్పుకొచ్చారు. 2014లో మొదటిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎన్ వెళ్లా. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వెళ్లానని గుర్తు చేశారు. 

ఈ ఐదేళ్లలో చాలా పెద్ద మార్పును గమనించినట్లు ప్రధాని చెప్పుకొచ్చారు. గతంతో పోల్చితే ఈ పర్యటన చాలా సక్సెస్ అయ్యిందన్నారు. భారత్ పట్ల గౌరవం, భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథం మారిందన్నారు. హౌడీ-మోడీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. హౌడీ-మోడీ కార్యక్రమం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసిందని మోదీ స్పష్టం చేశారు.