ప్రధాని నరేంద్ర మోడీ తన డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో సీఐసీ జారీ చేసిన ఆదేశాలను కొట్టివేస్తూ.. ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం కోరిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. 

ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్లను ప్రధాని కార్యాలయం సమర్పించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ వివరాలు కోరిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు రూ.25,000 జరిమానా విధించింది. మోడీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీల వివరాలను సమర్పించాలని పీఎంవో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ పీఐవోలను ఆదేశిస్తూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) జారీ చేసిన ఉత్తర్వులను సింగిల్ జడ్జి జస్టిస్ బీరేన్ వైష్ణవ్ తోసిపుచ్చారు. 

యూపీలోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. న‌లుగురు మృతి

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు విధించిన జరిమానా మొత్తాన్ని ఆయన నాలుగు వారాల్లోగా గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది పెర్సీ కవిత అభ్యర్థన మేరకు జస్టిస్ వైష్ణవ్ తన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రధాని మోడీ మాస్టర్ ఇన్ ఆర్ట్స్ (ఎంఏ) డిగ్రీ వివరాలను అందించాలని సీఐసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ 2016లో పిటిషన్ దాఖలు చేసింది. దానిని హైకోర్టు స్వీకరించింది. మూడు నెలల తరువాత సీఐసీ ఉత్తర్వులపై స్టే విధించింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన గుజరాత్ యూనివర్సిటీ తరుఫున హైకోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా.. ఆర్టీఐ కింద విద్యార్థి డిగ్రీని బహిర్గతం చేయడం వ్యక్తి గోప్యతను ఉల్లంఘించడమే అవుతుందని వాదించారు. ప్రధాని మోడీ డిగ్రీలకు సంబంధించిన సమాచారం ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. దీనికి సంబంధించిన వివరాలను గతంలోనే యూనివర్సిటీ తన వెబ్ సైట్ లో ఉంచిందని తెలిపారు. ఆర్టీఐలో ఉన్న కొన్ని మినహాయింపులను ప్రస్తావించారు. కొందరు ఆర్టీఐను ప్రత్యర్థులపై దాడి చేయడానికి ఉపయోగిస్తున్నారని మెహతా వాదించారు. దీంతో ఈ కేసు విచారణను అదే రోజు గుజరాత్ హైకోర్టు ముగించింది.

Scroll to load tweet…

ఈ కేసులో తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘తమ ప్రధాని విద్య గురించి తెలుసుకునే హక్కు కూడా దేశానికి లేదా? డిగ్రీ చూపించడాన్ని కోర్టులో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు ? డిగ్రీలు చూడాలని డిమాండ్ చేసే వారికి కూడా జరిమానా విధిస్తారా? ఇంతకీ ఏం జరుగుతోంది? నిరక్షరాస్యుడైన లేదా ఎక్కువగా చదువుకోని ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం.’’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా.. ప్రధాని మోడీ విద్యార్హతలను టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కోర్టు నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటికే ప్రధాని విద్యార్హతలపై ప్రశ్నలు సందిస్తూ పలు నగరాల్లో ఆ పార్టీ పోస్టర్లు అంటించింది.