చైనా విడుదల చేసిన స్టాడంర్డ్ మ్యాప్ లో మన దేశంలోని కొన్ని భాగాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దీనిపై ప్రధాని మాట్లాడాలని, ఏదో ఒకటి చెప్పాలని డిమాండ్ చేశారు.
చైనా కొత్తగా విడుదల చేసిన స్టాండర్డ్ మ్యాప్ పై దేశ వ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతోంది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని అధికార బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా మరో సారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా భారత్-చైనా సరిహద్దు వివాదంపై ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. లడఖ్ లోని ఒక్క భూభాగాన్ని కూడా చైనా లాక్కోలేదని ప్రధాని మోడీ అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు.
‘‘లడఖ్ లో ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదని ప్రధాని చెప్పింది అబద్ధం. ఈ విషయం నేను చాలా ఏళ్లుగా చెబుతున్నాను. చైనా అతిక్రమణ చేసిందని లడఖ్ మొత్తానికి తెలుసు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మ్యాప్ సమస్యను ప్రధాని అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆయన సూచించారు. చైనా మన భూమిని లాక్కుందని, దీనిపై ప్రధాని ఏదో ఒకటి చెప్పాలని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇటీవల రాహుల్ గాంధీ లడఖ్ లో పర్యటించారు. తన పర్యటన అనంతరం ఆయన మాట్లాడుతూ..లడఖ్ లోని ప్రజల భూములను చైనా లాక్కుందని ఆయన ఆరోపించారు. పశువులను మేపేందుకు స్థానికులను అనుమతించడం లేదని అన్నారు. చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు భారత భూభాగంలో అంగుళం కూడా తీసుకోలేదనే కేంద్రం వాదనలో నిజం లేదని అన్నారు. స్థానికులు కూడా భారత భూభాగంలోకి చొరబడి చైనా దళాలు స్వాధీనం చేసుకున్నాయని వాదిస్తున్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు.
సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ పబ్లిసిటీ డే, నేషనల్ మ్యాపింగ్ అవేర్నెస్ పబ్లిసిటీ వీక్ సందర్భంగా చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఆగస్టు 28వ తేదీన ఆ దేశ స్టాండర్డ్ మ్యాప్ ను విడుదల చేసింది. అందులో అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ లోని భాగంగా చూపించింది. అలాగే అక్సాయ్ చిన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం కూడా ఈ కొత్త మ్యాప్ లో చైనా భూభాగంలోనే కనిపిస్తున్నాయి. తొమ్మిది దశల రేఖపై చైనా వాదనలను కూడా ఈ మ్యాప్ లో పొందుపరిచారు.
కాగా.. ఇటీవల దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సమావేశమై సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై చర్చించారు. ఈ సమావేశం జరిగిన కొన్ని రోజుల్లోనే చైనా తన తాజా మ్యాప్ ను విడుదల చేసింది. ఇదిలా ఉండగా త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ కు రానున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో భారత్ లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అయితే చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్ పై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ‘‘మన భూభాగాల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. అసంబద్ధమైన వాదనలు చేసినంత మాత్రనా ఇతరలు భూభాగాలు మీవి (చైనావి) కావు. ’’ అని అన్నారు.
