Bilkis Bano case: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఒక కుటుంబంపై క్రూరంగా దాది చేయడంతో పాటు ఐదు నెలల గర్బిణిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను ఇటీవల గుజరాత్ సర్కారు విడుదల చేసింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రధాని మోడీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Congress leader Rahul Gandhi: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే ముస్లిం మహిళపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులను హతమార్చిన 11 మంది దోషులను విడుదల చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర బీజేపీ సర్కారు ఒకే చెప్పింది. సుప్రీంకోర్టుకు తాజాగా ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలపట్ల గౌరవం లేని సర్కారు.. కేవలం ప్రసంగాలకే పరిమితమైందన్నారు. బీజేపీ ప్రభుత్వాలకు మహిళలపై గౌరవం లేదనీ, ప్రధాని మోడీ మాటలు, చేష్టలు దీనిని స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు. వారు (ప్రధాని మోడీ) రేపిస్టులతో నిలబడి ఉన్నారని మండిపడ్డారు. బిల్కిస్ బానో కేసును గురించి ప్రస్తావించారు.
"ఎర్రకోట నుండి, మహిళల పట్ల గౌరవం గురించి మాట్లాడండి; కానీ వాస్తవానికి, రేపిస్టులతో నిలబడుతున్నారు" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. "ప్రధానమంత్రి వాగ్దానాలు.. ఉద్దేశ్యం మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉంది. ప్రధాని మహిళలను మోసం చేశారు" అని విమర్శించారు. ఆగస్టు 15న తన ప్రసంగంలో ప్రధాని మోడీ మహిళా సాధికారత కోసం పిలుపునిచ్చారు. అదే రోజున బీజేపీ ప్రభుత్వం ఒక కుటుంబంపై దాడి చేసి పలువురు అత్యంత క్రూరంగా హత్య చేయడంతో పాటు ఐదు నెలల గర్బిణిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మందిని విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమైంది. ప్రతిపక్షాలు, పౌర సంఘాలు కేంద్రంపై విమర్శలు చేయడంతో పాటు ఈ నిర్ణయం పై మళ్లీ ఆలోచన మార్చుకోవాలనీ, దోషులను విడుదల చేయవద్దు అంటూ పేర్కొన్నారు.
బిల్కిస్ బానో కేసులో దోషులను గుజరాత్ సర్కారు విడుదల చేయడంపై పలువురు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులకు మినహాయింపు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.14 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిన తర్వాత ప్రభుత్వం దోషులను నిర్దోషులుగా విడుదల చేసిందని, వారి ప్రవర్తన బాగానే ఉందని ప్రభుత్వం పేర్కొందని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది. ఈ కేసులో దోషులుగా ఉన్న వారిని విడుదల చేసేందుకు జూలై 11 నాటి లేఖ ద్వారా ముందస్తు విడుదలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని తన అఫిడివిట్ లో పేర్కొంది. అయితే, క్రూర హత్యలు, రేప్ కేసులో దోషులను బీజేపీ సర్కారు విడుదల చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
