ఢిల్లీ: అమృత్ సర్ లోని ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసి మనసు చలించిపోయిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చెయ్యాలని ఆదేశించినట్లు మోదీ ట్వీట్ చేశారు. 

 

రైలు ప్రమాదంపై సీఎం అమరీందర్ సింగ్ దిగ్భ్రాంతి
పంజాబ్: అమృత్ సర్ లోని ఘోర రైలు ప్రమాదంపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాద ఘటనలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను ముమ్మురం చెయ్యాలని హోంశాఖ కార్యదర్శి, మరియు ఆరోగ్య శాక కార్యదర్శిలుకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ప్రవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలందించాలని ఆదేశించారు. ప్రజలు కూడా సంయమనం పాటించాలని కోరారు.

మరోవైపు పంజాబ్ రెవెన్యూ శాక మంత్రి సుఖ్ బిందర్ సర్కారియాను ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని సీఎం అమరీందర్ సింగ్ పరిశీలించనున్నట్లు తెలిపారు.  

 

మాటలు రావడం లేదు: కేంద్రహోం శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్
ఢిల్లీ: అమృత్ సర్ లోని ఘోర రైలు ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ప్రమాదం చాలా బాధాకరమన్నారు. బాధతో మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  దసరా పండుగ రోజులు ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.