దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ముందుగానే స్పందించిన భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధిచింది. అయినా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. భారత్ లో పదివేల కేసులు దాటాయి. ఈ క్రమంలో మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించారు. అయితే.. ఈ లాక్ డౌన్ పొడిగింపు కారణంగా ఓ ఆలయ పూజారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన  మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి పట్టణానికి చెందిన కృష్ణ ముంబై నగరంలోని కండివలీలోని దుర్గామాత దేవాలయంలో పూజారిగా పనిచేసేవాడు. కృష్ణ పూజారిగా ముంబైలో పనిచేస్తూ తోటి పూజారులతో కలిసి నివాసముండేవాడు. లాక్‌డౌన్‌ సడలిస్తే తన స్వస్థలమైన ఉడుపీకి వెళదామని పూజారి కృష్ణ భావించాడు. 

అయితే అనూహ్యంగా లాక్‌డౌన్‌ ను మే 3వతేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన తర్వాత ఆందోళన చెందిన పూజారి కృష్ణ వంటగదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూజారి ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. పోలీసులు పూజారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.