వివాహితతో కలిసి ఓ స్వామిజీ క్షుద్రపూజలు నిర్వహించాడు. అయితే... ఆ పూజ మధ్యలో భారీ పేలుడు సంభవించి... ఆ పూజ చేస్తున్న స్వామిజీ సజీవదహనమయ్యాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చెన్నై నంగనల్లూరు ప్రాంతానికి చెందిన స్వామీజీ గోవిందరాజ్‌(49). ఇతను తిరువళ్లూరు జిల్లా ఎరయమంగళంలో ఎకర స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడే ఇల్లు కట్టుకుని 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. ఎరయమంగళం సమీపంలోని గ్రామాలకు చెందిన ప్రజలకు సిద్ధవైద్యం జ్యోతిష్యం, సంప్రదాయ పూజలను నిర్వహిస్తూ నివాసం వుంటున్నాడు. ప్రముఖ స్వామీజీగా గుర్తింపు పొందిన గోవిందరాజ్‌ వద్దకు చెన్నై ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ పూజలు నిర్వహిస్తుంటారు.

ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం వివాహిత లావణ్య గోవిందరాజ్‌ వద్దకు వచ్చి ఆశ్రయం పొందుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నిత్యం పూజలు నిర్వహించే గోవిందరాజ్, బుధవారం రాత్రి 9 గంటలకు పూజలకు ఉపక్రమించిన సమయంలో, పది గంటల ప్రాంతంలో భారీ శబ్ధ్దంతో పేలుడు సంభవించింది. ఈఘటనలో స్వామిజీ సజీవదహనమయ్యాడు. కాగా... అతని ఇంట్లో ఉన్న వివాహిత లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గోవిందరాజ్‌ మృతదేహాన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. గోవిందరాజ్‌ ఇంట్లో ఏర్పడిన భారీ పేలుడు విషయాన్ని మప్పేడు పోలీసులు ఫోరెన్సిక్‌ అధికారులకు చేరవేశారు. దీంతో డీఎస్పీ నళిని నేతృత్వంలో పోలీసులు గురువారం ఉదయం ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. గోవిందరాజ్‌ నిత్యం క్షుద్రపూజలు నిర్వహించేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.