గుడిలో మద్యం తాగొద్దన్న చిన్న కారణంతో దుండగులు పూజారిని దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని ఓ మారుమూల గ్రామంలోని ఓ మందిరంలో సుందర్ భూయా అనే వ్యక్తి పూజారిగా పనిచేస్తున్నాడు.

శనివారం  సాయంత్రం కొంతమంది ఆకతాయిలు మద్యం, మాంసంతో గుడిలోకి వచ్చారు. దీనిని గమనించిన సుందర్ పవిద్రమైన దేవాలయంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని మందిలించాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుండగులు పూజారితో వాగ్వాదానికి దిగడమే కాకుండా కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో సుందర్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

అతను చనిపోయి ఉంటాడని భావించిన దుండగులు ఆయన్ను పొదల్లో పడేసి వెళ్లిపోయారు. తర్వాతి రోజు ఉదయం పూజలు నిర్వహించడానికి వచ్చిన భక్తులు పూజారిని పొదల్లో చూసి పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు పూజారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స తీసుకుంటూ సుందర్ ప్రాణాలు కోల్పోయాడు.

అంతకు ముందే పూజారి వాంగ్మూలం స్వీకరించిన పోలీసులు.. తన సొంత గ్రామానికి చెందిన జీతూ భూయా అనే వ్యక్తితో పాటు మరికొందరు తనని కత్తులతో పొడిచారని చెప్పాడు. దీని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తును ప్రారంభించారు.