ఉత్తర ప్రదేశ్ లోని ఓ ఆలయంలో పూజారికి దారుణంగా చంపేశాడో దుండగుడు. ఆ పూజారి తనకు తానేకాళికామాత అవతారంగా ప్రకటించుకున్నాడు. ఈమేరకు అతను ఎప్పుడూ చీర, గాజులు ధరించే కనిపించేవాడు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 

పూజారిని కత్తితో పొడిచి పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశారు. వివరాల్లోకి వెడితే.. ఇస్లాంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఢాక్ నగ్ల గ్రామంలోని ఆలయంలో పూజారి జై సింగ్ యాదవ్ ఆలయ ఆవరణలో ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. అతడిని 75 యేళ్లు. 

జై సింగ్‌ యాదవ్‌ గతంలో తనకు తాను కాళికామాత అవతారంగా ప్రకటించుకున్నాడు. అందుకే ఎప్పుడూ చీర, గాజులు ధరించి కనిపించేవాడు. స్థానికంగా ఆయన్ని సఖీబాగా అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో సఖీబాబాను కలిసేందుకు శనివారం రాంవీర్‌ యాదవ్‌ వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. మాట్లాడుకునే సమయంలో ఓ విషయమై సఖీబాబాకు, రాంవీర్‌కు మధ్య వివాదం పెరిగింది.

మాటా మాటా పెరగడంతో క్షణికావేశంలో రాంవీర్, సఖీబాబాను కత్తితో పొడిచాడు. దీంతో బాబా అక్కడికక్కడే మృతి చెందాడు. కేకలు విన్న స్థానికులు రాంవీర్ ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకుని పారిపోయాడు. 

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోనే సఖీబాబా ఉండేవాడు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం నిందితుడిపై హత్య కేసు నమోదు చేశామని ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. 

నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే ఎందుకు హతమార్చాడనే విషయం ఇంకా తెలియలేదని తెలిపారు.