మన చుట్టూ అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చనిపోయిందని భావించిన ఓ మహిళ ప్రాణాలతో తిరిగొచ్చిన ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బులంద్ షహర్‌లోని ఇస్లామాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న వరీషా భర్త అమీర్ జూలై 23న తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే నెల 27న ఘజియాబాద్ సమీపంలో సూట్‌కేసులో లభ్యమైన మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

అనంతరం అమీర్ కుటుంబసభ్యులకు సమాచారం అందించగా, ఆ మృతదేహం తన భార్య వరీషాదేనని చెప్పి అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం వరీషా పోలీసులను సంప్రదించి తాను బతికే ఉన్నానని పేర్కొంది.

అంతేకాకుండా తన భర్త అమీర్, అత్త వరకట్నం కోసం తనను వేధించారని, వారి వేధింపులు భరించలేక నోయిడా వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు. దీంతో పోలీసులు ఖంగు తిన్నారు.

ఆ వెంటనే తేరుకుని అమీర్, అతని తల్లిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతా బాగానే వుంది కానీ, అసలు ఇంతకీ ఆ సూట్‌ కేసులో లభించిన మృతదేహం ఎవరిదనేది తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.