హిజాబ్ ధరించాలని హిందూ విద్యార్థినులపై ఒత్తిడి.. గంగా జమునా స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు..
హిజాబ్ ధరించాలని హిందూ విద్యార్థినులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపణలు వచ్చిన గంగా జమునా స్కూల్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి చెందిన 11 మంది సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హిందూ విద్యార్థినులను హిజాబ్ ధరించాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలోపై మధ్యప్రదేశ్ లోని గంగా జమునా స్కూల్ యాజమాన్య కమిటీకి చెందిన 11 మంది సభ్యులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. రాజధాని భోపాల్ కు 250 కిలోమీటర్ల దూరంలోని దామోహ్ జిల్లాలో తొమ్మిది మంది ముస్లింలు, ఇద్దరు ముస్లిమేతరులతో కూడిన ఈ ప్రభుత్వ-ఎయిడెడ్ మైనారిటీ పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులపై కొత్వాలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిపై బుధవారం భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 295, 506, అలాగే జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టంలోని నిబంధనల కింద అభియోగాలు మోపారు.
విషాదం.. ఇసుకలో జారిపడి, ట్రాక్టర్ చక్రాల కింద నలిగి నాలుగేళ్ల బాలుడు మృతి
హిందూ బాలికలను బలవంతంగా హిజాబ్ ధరించాలని ఒత్తిడి తీసుకొచ్చారని ఈ స్కూల్ పై గత కొంత కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ వివాదంపై నిజానిజాల్ని తేల్చేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొందరు విద్యార్థుల నుంచి వాంగ్మూలాలు తీసుకుంది. కమిటీ సిఫార్సుల మేరకు స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే దర్యాప్తు జరుగుతున్న క్రమంలో నిందితులపై మరిన్ని సెక్షన్ లు మోపే అవకాశం ఉందని దామోహ్ ఎస్పీ రాకేష్ సింగ్ చెప్పారు.
ఆ విషయంలో ఇంకా మౌనం ఎందుకు..ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఆగ్రహం
ఆరో, ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థుల (ఇద్దరు బాలికలు, ఒక బాలుడు) వాంగ్మూలాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు దామోహ్ పోలీసు వర్గాలు తెలిపాయని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. ఆ ముగ్గురు విద్యార్థులు హిందువులే. అయితే స్కూల్ ప్రాంగణంలో ఉన్నప్పుడు హిజాబ్ ధరించాలని యాజమాన్యం తమపై ఒత్తిడి తీసుకొచ్చిందని విద్యార్థినులు ఆరోపించారు. అంతేకాకుండా తమ మణికట్టుపై ఉన్న పవిత్ర దారాన్ని (కలవా), నుదుటిపై ఉన్న మతపరమైన గుర్తును (తిలక్) బలవంతంగా తొలగించారని ముగ్గురు విద్యార్థులు పేర్కొన్నారు. ఉదయం ప్రార్థనల సమయంలో అల్లామా ఇక్బాల్ కవిత "లబ్ పే ఆతి హై దువా బంకే తమన్నా" ను కూడా తాము పఠించాల్సి వచ్చిందని తెలిపారు.
కాగా.. పాఠశాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దామోహ్ జిల్లా పోలీసులను ఆదేశించినట్లు భోపాల్ లో రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియాకు తెలిపిన కొన్ని గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో మత మార్పిడుల కోణాన్ని కూడా పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.
శ్రీవారికి భావోద్వేగ లేఖ..103 రోజుల తర్వాత భార్యను కలిసిన సిసోడియా..
అసలేం జరిగిందంటే ?
కొన్ని రోజుల కిందట దామోహ్ జిల్లాలో ఉన్న ఈ గంగా జమునా పాఠశాల గోడపై పదో తరగతి బోర్డు టాపర్ల పోస్టర్ ను అతికించారు. అందులో ముస్లింలు కాని కొందరు బాలికలు హిజాబ్ ధరించి కనిపించారు. హిందువులను హిజాబ్ ధరించాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేసిందని ఆరోపిస్తూ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక్ కనూంగో దామోహ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ ముస్లిమేతర బాలికలను హిజాబ్ ధరించాలని బలవంతం చేస్తోందని ఆరోపిస్తూ వీహెచ్ పీ, భజరంగ్ దళ్, ఏబీవీపీ సహా మితవాద సంఘాలు దామోహ్ లో ఆందోళనకు దిగాయి. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. కాగా.. ఈ వివాదం పై గంగా జమునా హయ్యర్ సెకండరీ స్కూల్ యాజమాన్యానికి క్లీన్ చిట్ ఇచ్చారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు మంగళవారం డీఈవో ఎస్కే మిశ్రా ముఖంపై సిరా విసిరారు.