Presidential elections: అధికార ఎన్డీయే కూటమి తరఫున ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అభ్యర్థులు మద్దతు కోరుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాల పర్యటనలు కొనసాగిస్తున్నారు.
Shiv Sena leader Sanjay Raut: రాష్ట్రపతి ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అధికార, విపక్షాల కూటమి తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలు.. చట్టసభ సభ్యుల మద్దతు కోరుతూ.. వివిధ రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. సమయం దగ్గర పడుతుండటంతో ఇరు పక్షాలు వ్యూహాలను అమలు పరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే శివసేన నాయకుడు, పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వడం అంటే బీజేపీకి మద్దతు ఇవ్వడం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి ఎన్నికల కోసం జూలై 11న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇది ముగిసిన తర్వాత.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి ఈ సమావేశంలో చర్చలు జరిగాయని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ మంగళవారం ధృవీకరించారు. అలాగే, ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వడం అంటే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి మద్దతు ఇవ్వడం కాదని ఆయన అన్నారు. "నిన్న మా సమావేశంలో ద్రౌపది ముర్ము (ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి) గురించి చర్చించాము. ద్రౌపది ముర్ముకి మద్దతు ఇవ్వడం అంటే బీజేపీకి మద్దతు ఇవ్వడం కాదు. శివసేన పాత్ర ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది. పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకుంటారు" అని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. అలాగే, ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పట్ల తమ పార్టీకి చిత్తశుద్ధి ఉందని కూడా ఆయన చెప్పారు.
‘‘ప్రతిపక్షం సజీవంగా ఉండాలి. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పట్ల కూడా మాకు చిత్తశుద్ధి ఉంది. ఇంతకుముందు మేము ప్రతిభాపాటిల్‌కు మద్దతు ఇచ్చాము.. NDA అభ్యర్థికి కాదు. మేము ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతు ఇచ్చాము. శివసేన ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోదు' అని ఆయన అన్నారు. అంతకుముందు సోమవారం, పార్టీ ఎంపీ గజానన్ కీర్తికర్ మాట్లాడుతూ.. శివసేన చీఫ్ పిలిచిన సమావేశానికి 18 మంది పార్టీ ఎంపీలలో 16 మంది హాజరయ్యారని, ఉద్ధవ్ థాక్రే తన నిర్ణయాన్ని ఒకటి లేదా రెండు రోజుల్లో తెలియజేస్తారని అన్నారు."ఆమె NDA అభ్యర్థి అయితే ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందిన మహిళ. మేము ఆమెకు మా మద్దతు ఇవ్వాలి... ఇది ఎంపీలందరి (పార్టీ) డిమాండ్. ఒకటి రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని ఉద్ధవ్ జీ మాకు చెప్పారు" అని కీర్తికర్ అన్నారు.
"యూపీఏ అభ్యర్థి ప్రతిభా పాటిల్ మరాఠీ మహిళ కాబట్టి మేము ఆమెకు మద్దతు ఇచ్చాము. మేము UPA అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాము. ఆమె గిరిజన మహిళ అయినందున ఉద్ధవ్ జీ ఆమెకు (ద్రౌపది ముర్ము) మద్దతు ప్రకటిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం రాజకీయాలకు అతీతంగా చూడాలి' అని ఆయన అన్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న ఓటింగ్, జూలై 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు.
