న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు రామ్ నాథ్ కోవింద్.

జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు పరిణామాల అనంతరం జమ్ము కశ్మీర్ ప్రజలకు మరింత లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 72 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారత జాతిపిత మహాత్మగాంధీని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ 2న జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు జరుగునున్నాయని గుర్తు చేశారు.   

గాంధీ కృష్టి, పట్టుదల, అకుంఠిత దీక్షతో బ్రిటీష్ పాలన నుంచి భారత్ కు విముక్తి కలిగిందని చెప్పుకొచ్చారు. జమ్మూకశ్మీర్, లఢఖ్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలు మెరుగైన భవిష్యత్ ను అందుకోనున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

దేశంలోని మిగతా రాష్ట్రాలు ఎలాంటి హక్కులు ఉంటాయో ఇక నుంచి జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రజలకు అవే హక్కులు ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది ప్రఖ్యాత సిక్కు గురువు గురునానక్ 550వ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించుకున్నామని అదొక ప్రత్యేకత అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు.