పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి రాజీనామాను ఆమోదించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. నిన్న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించగా.. సంఖ్యాబలం లేకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు.

అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్‌నివాస్‌కు వెళ్లిన ఆయన రాజీనామా లేఖను ఎల్జీకి ఇచ్చారు. ఇవాళ సీఎంతో పాటు మంత్రుల రాజీనామాలను ఆమోదించారు రాష్ట్రపతి .

కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడంతో విపక్ష ఎన్ఆర్ కాంగ్రెస్‌ కూటమికి బలం నిరూపించుకునేందుకు ఎల్జీ అవకాశం ఇస్తారా లేకపోతే ఎన్నికలకు రెండు నెలల సమయం వుండటంతో గవర్నర్ పాలనకు ఆమోదం తెలుపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read:నారాయణ స్వామి రాజీనామా.. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన !?..

కాగా, ఇటీవల కాంగ్రెస్‌కు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడింది. కొత్తగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఆదేశించారు.

సోమవారం బలపరీక్షకు నారాయణ స్వామి సిద్ధమవ్వగా మరో ఇద్దరు రాజీనామా చేశారు. దీంతో అధికార కాంగ్రెస్ కూటమి బలం 12కి తగ్గింది. విశ్వాస పరీక్షలో విఫలమవ్వడంతో నారాయణ స్వామి రాజీనామా చేశారు.