సత్నామ్ సింగ్ సంధు: రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము
చండీఘడ్ యూనివర్శిటీ చాన్సలర్ సత్నామ్ సింగ్ సంధును రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు.
న్యూఢిల్లీ:ఛండీఘడ్ యూనివర్శిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధును రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. సత్నామ్ సింగ్ ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్టుగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
ఫిరోజ్ పూర్ లోని రసూల్ పుర గ్రామంలో సంధు జన్మించారు.అతని తండ్రి రైతు. 2001లో సంధు విద్యారంగంలో ప్రవేశించారు. చండీఘడ్ అనే ప్రైవేట్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. విద్యాభ్యాసం కోసం సంధు బాల్యంలో చాలా కష్టాలు పడ్డారు. అయితే తన మాదిరిగా విద్య కోసం ఎవరూ కష్టాలు పడకూడదనే ఉద్దేశ్యంతో ఆయన ప్రైవేట్ యూనివర్శిటీని ఏర్పాటు చేశాడు.2012లోనే ప్రైవేట్ యూనివర్శిటీలలో చండీఘడ్ యూనివర్శిటీ ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలిచింది.
లక్షలాది మంది విద్యార్థులు చదువుకునేందుకు సంధు పరోక్షంగా, ప్రత్యక్షంగా కారణమయ్యారు. రెండు ఎన్ జి ఓ సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థల ద్వారా ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు మతసామరస్యం పెంపొందించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ సమైక్యత కోసం సంధు పలు కార్యక్రమాలను నిర్వహించారు. విదేశాల్లోని ప్రవాసులతో కూడ కలిసి పనిచేశాడు.
సత్నామ్ సంధును రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.ప్రముఖ విద్యావేత్తగా , సామాజిక కార్యకర్తగా సంధు పేరొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.జాతీయ సమైఖ్యత కోసం సంధు నిరంతరం పనిచేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.
**